రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
వార్డు సచివాలయాలపై ఆకస్మిక తనిఖీ –కమీషనర్ ఆదేశాలు
ప్రొద్దుటూరు పట్టణంలోని స్వరాజ్యనగర్ పరిధిలో ఉన్న 7, 8 వార్డు సచివాలయాలను కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల అమలుపై ఆయన సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన కమీషనర్, ప్రభుత్వ పరంగా ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ప్రజల అభిప్రాయాలు, ఎదుర్కొంటున్న సమస్యలను ఆరాతీశారు.
ప్రజా కేంద్రంగా పనిచేస్తున్న వార్డు సచివాలయాల ద్వారా సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కమీషనర్ సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించాలని సిబ్బందికి సూచనలు చేశారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సచివాలయంలో సిబ్బంది ప్రజల కోసం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కమీషనర్ ఆదేశించారు. ఈ సమయాల్లో ప్రజల ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించి, వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తనిఖీ అనంతరం ఈ-కేవైసీ, పిల్లల ఆధార్ నమోదు, తల్లి–పిల్లల మ్యాపింగ్, మనమిత్ర ట్రైనింగ్ తదితర అంశాలపై సచివాలయ సిబ్బందితో కమీషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లక్ష్యాలకు అనుగుణంగా పనితీరు ఉండాలని సూచించారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని సచివాలయాలు ప్రజలకు అందిస్తున్న సేవల విషయంలో పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్ పెరిగేలా పనిచేయాలని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు సమాచారం.













