రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రొద్దుటూరు మండల సమావేశం అక్టోబర్ 10న మున్సిపల్ హైస్కూల్లో జరిగింది. ఐద్వా ప్రొద్దుటూరు కార్యదర్శి జి. ప్రేమ ఆధ్వర్యంలో, అధ్యక్షులు వై. విజయమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళల హక్కులు, రిజర్వేషన్లు, ప్రజాస్వామ్య పరిరక్షణపై పలు తీర్మానాలు ఆమోదించారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రమ్మ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి, తగిన సంఖ్యలో స్థానాలు కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. అలాగే రాష్ట్రంలో అమలులో ఉన్న శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విస్తరించి, మహిళల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న హర కొర బస్సులు సరిపడడం లేదని మహిళలు అభిప్రాయపడ్డారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను విధుల నుంచి తప్పించాలని సమావేశం కోరింది. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకులకు మాత్రమే ఓట్లు వేయాలని, మాటలు చెప్పి ప్రజల సొమ్ము దోచుకుంటూ అవినీతికి పాల్పడుతున్న, స్వప్రయోజనాలు చూసే నాయకులను ఓట్ల ద్వారా తిరస్కరించాలని మహిళా సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
“కేంద్రంలో BJP ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. మహిళలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. లేనిపక్షంలో నీటి పేపర్ లీక్ ఆందోళన ఏవిధంగా జరిగిందో, అదేవిధంగా మహిళలందరూ BJP ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇంటికి సాగనంపుతారు,” అని సావిత్రమ్మ అన్నారు.
“ప్రజల కోసం పనిచేసే నాయకులకు ఓట్లు వేయాలి. మాటలు చెప్పి ప్రజల సొమ్ము దోచుకుంటూ అవినీతికి పాల్పడుతూ సొంత ప్రయోజనాలు పొందుతున్న వారికి ఓట్లు వేయొద్దు,” అని ఆమె పిలుపునిచ్చారు.
“రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు శ్రీ శక్తి బస్సు ఉచిత ప్రయాణం కల్పించినా, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో బస్సులు నడపడం లేదు. గతంలో కేరళలో CPM ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50% మహిళలను పోటీలో నిలబెట్టింది. అలానే మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం మహిళలకు స్థానాలు కేటాయించాలి,” అని సావిత్రమ్మ పేర్కొన్నారు.
“నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గానీ వాటి గురించి ఆలోచించడం లేదు. ఈ అధిక ధరలతో కుటుంబాలు నడపలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంలో BJP ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలి,” అని ఆమె అన్నారు.
“ప్రజల పవిత్రమైన ఓట్లను 13 కోట్లు ఓట్లు తొలగించి మూడవసారి అధికారంలో కొనసాగుతున్న BJPని ఇంటికి సాగనంపాలి. అందుకు బాధ్యులైన జ్ఞానేశ్ కుమార్ను విధుల నుంచి తప్పించాలి,” అని సావిత్రమ్మ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీదేవి, వెంకటసుబ్బమ్మ, కళావతి, భానుమతి, ఝాన్సీ, పుష్పలత, శారదా తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై, సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు మద్దతు తెలిపారు.













