రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధం ప్రొద్దుటూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై ఒక్కరోజు రిలే దీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సాధారణ కార్మికులు, ఆప్కాస్ కార్మికులు, కోవిడ్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దీక్షలో యూనియన్ అధ్యక్షులు చంటి, పట్టణ ప్రధాన కార్యదర్శి సాల్మన్, గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమార్, పట్టణ కోశాధికారి రాఘవేంద్రతో పాటు పట్టణ కమిటీ సభ్యులు నీతిమ్మ, ప్రమీలమ్మ, గుర్రప్ప, మోహన్, ఇంజనీర్ సెక్షన్ కార్మికుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

దీక్ష సందర్భంగా యూనియన్ నాయకత్వం మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించింది. మూడు సంవత్సరాల క్రితం మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, వారసత్వ నియామకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆప్కాస్ కార్మికులను 60 సంవత్సరాలు పూర్తయ్యిందని ఒక్కసారిగా సేవల నుంచి తొలగిస్తున్నారని, వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు, పింఛన్, కుటుంబ సభ్యులకు ఉద్యోగం వంటి హక్కులు ఏవీ కల్పించడం లేదని యూనియన్ నాయకులు ఆక్షేపించారు. ఆప్కాస్ కార్మికులకు కనీసం 10 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్, నెలకు 10 వేల రూపాయల పింఛన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆప్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాల వరకు పొడిగించాలని, 12వ PRC అమలు చేసి వారి జీతాలను పెంచాలని యూనియన్ కోరింది. కార్మికులపై అమలు చేస్తున్న Face FRRS విధానాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
కోవిడ్ సమయంలో పనిచేసిన కార్మికులకు కలెక్టర్ ఆదేశాల మేరకు SS రేట్ల ప్రకారం నెలకు 18,500 రూపాయల జీతం ఇవ్వాలని, వారిని ఆప్కాస్‌లో చేర్చాలని యూనియన్ నాయకులు తెలిపారు. బద్వేల్ , జమ్మలమడుగు , మైదుకూరు , కడప మున్సిపాలిటీలలో కోవిడ్ కార్మికుల జీతాలు పెంచి ఇస్తున్నప్పటికీ, ప్రొద్దుటూరులో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రాష్ట్రంలో వ్యాపారంలో ముందంజలో ఉండి, కార్పొరేషన్‌గా మారే స్థాయిలో ఉన్నప్పటికీ, ఇక్కడి కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని యూనియన్ నాయకత్వం పేర్కొంది. చిన్న మున్సిపాలిటీలలో జీతాలు పెంచి ఇస్తూ, ప్రొద్దుటూరులో డబ్బులు లేవని ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ బాధ్యత తప్పించుకోవడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు.
ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్‌పై ప్రత్యేక G.O జారీ చేయాలని, హై కోర్ట్ ఆదేశాల మేరకు వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, సుప్రీమ్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం’ అమలు చేయాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.













