ప్రొద్దుటూరు: డీఎస్సీ ద్వారా ఎన్నికైన టీచర్లపై వైసీపీ పార్టీ నాయకులు దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

విజయవాడలోని షాప్ కార్యాలయం సమీపంలో వైసీపీ నాయకులు టీచర్లపై చేసిన దాడి ఘటనపై స్పందించిన సుంకర వేణుగోపాల్, వైసీపీ నాయకులు టీచర్లపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుండటంతో టీచర్లు శాంతియుత నిరసన చేపట్టారని తెలిపారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న రౌడీషీటర్లు, వైసీపీ చిల్లర బ్యాచ్ కలిసి టీచర్లపై ముకుమ్మడిగా దాడి చేశారని ఆయన ఆరోపించారు.

టీచర్లపై కోడిగుడ్లు, వాటర్ బాటిల్స్, కర్రలు, రాడ్లతో దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించడం పిరికితనానికి నిదర్శనమని సుంకర వేణుగోపాల్ విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే డీఎస్సీ పోస్టులను తీసేస్తామని వైసీపీ నాయకులు బెదిరించడం కూడా అత్యంత దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో అలజడులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ చిల్లర బ్యాచ్ ఇలాంటి పనులకు పాల్పడుతోందని సుంకర వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ దుర్మార్గమైన చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి, వారి ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓటు శక్తితో ఓడిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సుంకర వేణుగోపాల్ హెచ్చరించారు. టీచర్లపై దాడి చేసిన ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో శంకరాపురం చంద్రమోహన్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు కందుల బాలసుబ్రమణ్యం, ఎస్సీ నాయకుడు లింగాపురం బాలయ్య పాల్గొన్నారు.