రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా పులివెందుల పట్టణంలోని ఆంధ్ర ప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ లిమిటెడ్ (AP CARL) లో పనిచేస్తున్న AO శివప్రసాద్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని CITU నాయకత్వం డిమాండ్ చేసింది. కార్మికులపై వేధింపులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది.
పులివెందులలోని CITU కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ, AO శివప్రసాద్ ప్రవర్తనపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కార్మికుల పట్ల ఆయన అరాచకంగా, వేధింపులకు దిగడం అసహ్యకరమని పేర్కొన్నారు.
మనోహర్ వివరాల ప్రకారం, పులివెందుల AP CARL కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌లకు వారి విధులకు సంబంధం లేని పనులు అప్పగిస్తున్నారని, మరుగుదొడ్లు కడగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇతర ఇతర పనులు చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తమ పని మేము చేస్తామని కార్మికులు చెప్పినందుకు మెమోలు జారీ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని అన్నారు.
కార్మికులు ప్రశ్నించినా, వివరణ కోరినా, మెమోల ద్వారా పేరుపెట్టి వేధించడం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శివప్రసాద్ గతంలో అదే క్యాంపస్‌లో లక్షలాది, వేలాది రూపాయలను కట్టెల ద్వారా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయని, ఆ అవినీతిపై కార్మికులు ప్రశ్నించిన రోజు నుంచే శివప్రసాద్‌తో పాటు మరికొంతమంది కార్మికులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు ప్రారంభించారని తెలిపారు.
ఈ వేధింపులలో భాగంగానే మెమోలు జారీ చేసి, మూడు రోజులలో సంజాయి శివ్వాలని చెప్పడం దారుణమని మనోహర్ విమర్శించారు. ఈయన అవినీతిపై ప్రశ్నించిన కార్మికులపై కక్ష సాధించి, గతంలో కొందరి ఉద్యోగాలను తీసేసిన పరిస్థితి కూడా ఉందని గుర్తుచేశారు. ఆ సమయంలో జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి, అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఆ ఘటన తర్వాత శివప్రసాద్ కక్ష మరింత పెంచుకుని, అరాచకానికి పాల్పడుతున్నారని మనోహర్ ఆరోపించారు. ఈయన అవినీతి అంతం లేదని, ఇప్పటికైనా కార్మికులను వేధిస్తున్న శివప్రసాద్‌పై, అలాగే ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రెస్‌మీట్‌లో APKAS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, CITU జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీనివాసులు రెడ్డి, పి. చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













