రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైఎస్సార్ జిల్లా పులివెందులలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపం ఏర్పాటు విషయంలో చెలరేగిన చిన్న వివాదం చివరికి తుపాకీ కాల్పులు, వాహనాల ధ్వంసం వరకు వెళ్లింది. పట్టణంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
స్థానికంగా తెలుగు దేశం పార్టీ నాయకులు వెంకటశివారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి వర్గాల మధ్య వినాయక మండపం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై మొదట మాటల తూటాలు నడిచాయి. మాటమాట పెరగడంతో ఇరువర్గాల అనుచరులు పరస్పరం దాడులకు దిగారు. తోపులాటలు, దుర్భాషలతో ప్రారంభమైన ఘర్షణ కొద్ది సేపట్లోనే భౌతిక దాడులుగా మారింది.
ఈ ఉద్రిక్తత మధ్య అక్కడే ఉన్న ఒక గన్‌మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దంతో పులివెందుల పట్టణం, పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. వ్యాపారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘర్షణ సమయంలో ఇరువర్గాలకు చెందిన మూడు వాహనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు సమాచారం.
ఇక మరో ఘటనలో, పులివెందులలో గణేష్ విగ్రహం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులు పుష్పనాథ్‌రెడ్డి, విజయ్‌రెడ్డి వర్గాల మధ్య కూడా ఘర్షణ చెలరేగింది. స్థానిక వివాదం కారణంగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై, పరిస్థితి క్షణాల్లో ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో విజయ్‌రెడ్డి, పుష్పనాథ్‌రెడ్డిపై చేయి చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
ఇద్దరి అనుచరులు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ రాళ్ల దాడిలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద నిలిపి ఉంచిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లపై రాళ్లు, ధ్వంసమైన వాహనాలు కనిపించే పరిస్థితి నెలకొంది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు హజ్ కమిటీ డైరెక్టర్ భాషా మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. అయితే ఆయన అక్కడకు చేరుకున్న సమయంలోనే ఉద్రిక్తత మరింత పెరగడంతో, ఆయనతో ఉన్న గన్‌మ్యాన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పట్టణంలో మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. సొంత పార్టీ నేతలే వీధుల్లోకి దిగి ఈ స్థాయిలో పోరాటాలకు దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.













