వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని భాష్యం పాఠశాల యాజమాన్యం తీరుపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబానికి అండగా నిలవాల్సిన విద్యాసంస్థ, ఫీజు బకాయిల నెపంతో ఒక విద్యార్థి భవిష్యత్తును సంకటంలోకి నెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పులివెందులకు చెందిన రూప్రాదేవి కుమారుడు నితీష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా భాష్యం పాఠశాలలోనే చదువుతున్నాడు. ఏడో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల భవనం మేడపై నుంచి పడిపోవడంతో ఆ బాలుడి రెండు కాళ్లు విరిగిన విషయం స్థానికులకు తెలిసిందే. ఆ సమయంలో అత్తమామల సహాయంతో కుటుంబం ఫీజులు చెల్లిస్తూ చదువు కొనసాగించింది.

తరువాత ఎనిమిదో తరగతికి చేరిన సమయంలో నితీష్ తండ్రి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో మూడు నెలల ఫీజు బకాయి పడటంతో, భాష్యం పాఠశాల యాజమాన్యం బాలుడిని పాఠశాల నుండి ఇంటికి పంపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు రూప్రాదేవి భాష్యం పాఠశాల యాజమాన్యాన్ని టీసీ కోసం సంప్రదించగా, రూ. 21,600 బకాయి మొత్తం ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే టీసీ ఇస్తామని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూప్రాదేవి కష్టపడి రూ. 11,000 చెల్లించింది.

అయితే యాజమాన్యం ఇచ్చిన టీసీపై "నాట్ క్వాలిఫైడ్" అని రాతపూర్వకంగా పేర్కొనడంతో, నితీష్‌కు మరో పాఠశాలలో ప్రవేశం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా బాలుడి చదువు పూర్తిగా ఆగిపోతుందనే భయంతో రూప్రాదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఒకవైపు భర్తను కోల్పోయిన దుఃఖం, మరోవైపు పేదరికంతో పోరాడుతున్న రూప్రాదేవి పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోతున్నారు. ఇలాంటి సమయంలో విద్యాసంస్థ వ్యాపార ధోరణితో వ్యవహరించడం సమంజసం కాదని వారు విమర్శిస్తున్నారు.

భాష్యం పాఠశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యార్థి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నితీష్‌కు నిబంధనలకు అనుగుణంగా సరైన టీసీ జారీ చేసి, అతని విద్యాభవిష్యత్తు రక్షించేలా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.