రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం :- ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త సాంకేతికతను అనుసంధానిస్తూ, పారదర్శక డిజిటల్ పాలనను లక్ష్యంగా అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధితులు తమ ఫిర్యాదులను మరింత సులభంగా, త్వరితగతిన సమర్పించేలా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సిస్టం ‘ఏఐ ప్రజావాణి’ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు.
శిక్షణ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్‌తో కలిసి ఎస్పీ జగదీశ్ ఈ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, ఫిర్యాదు ప్రక్రియను సులభతరం చేయడంలో ఈ కొత్త వ్యవస్థ కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు.
వినూత్న వ్యవస్థను ‘ఖివిదిగీశ్రీతిఖి’ స్టార్టప్‌కు చెందిన యువ ఆవిష్కర్తలు, విద్యార్థుల బృందం అభివృద్ధి చేసింది. అత్యాధునిక ఏఐ సాంకేతికత, స్పీచ్ ప్రాసెసింగ్ టూల్స్ ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో కె. యశ్వంత్, దిలీప్‌కుమార్, శశికుమార్, ఆశిష్ తదితర విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. స్థానిక ప్రతిభకు, స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ అనంతపురం ప్రాంత యువత అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేధస్సు వినియోగానికి ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
‘ఏఐ ప్రజావాణి’ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది వాయిస్ టు టెక్ట్స్ సదుపాయం. ఫిర్యాదుదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యను నోటి మాట ద్వారా నేరుగా వివరించగానే, ఈ వ్యవస్థ ఆ వాయిస్‌ను ఆటోమేటిక్‌గా లిఖిత పూర్వక ఫిర్యాదుగా మారుస్తుంది. మాట్లాడిన ఫిర్యాదును కంప్యూటర్ సిస్టమ్ ఒక క్రమపద్ధతిలో సిద్ధం చేసి, తక్షణమే ప్రింట్ కాపీని బాధితులకు అందజేస్తుంది.
ఇదే సమయంలో ఆ ప్రింటెడ్ పిటిషన్ ఎస్పీ ముందుకు వెళ్లేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో బాధితులు ఫిర్యాదు సమర్పించిన వెంటనే అది ఎస్పీ దృష్టికి చేరి, అక్కడికక్కడే పరిష్కారానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఫిర్యాదులు సొంతంగా రాయలేని నిరక్షరాస్యులకు, అర్జీలు రాయించుకోవడానికి ఇతరులపై ఆధారపడే వారికి ఈ వ్యవస్థ వరంగా మారనుంది. అర్జీలు రాసి ఇచ్చే వారి వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో సమయం ఆదా కావడంతో పాటు కొంతవరకు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.
ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే PGRS వద్ద ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ‘ఏఐ ప్రజావాణి’ను అమలు చేయాలని పోలీసు శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజా సేవల్లో సాంకేతికత వినియోగాన్ని విస్తరించేందుకు ఈ ప్రయత్నం దోహదం చేయనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.













