రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 10 బీసీ గురుకుల పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం 2026–27 నుంచే ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన ఫైల్ రానున్నట్లు సమాచారం.
మొత్తం 10 గురుకుల పాఠశాలల్లో 5 బాలుర కోసం, 5 బాలికల కోసం ఏర్పాటు చేయనున్నారు. ఈ పాఠశాలల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధన నిర్వహించనున్నారు. మొదటి ఏడాది ప్రతి గురుకుల పాఠశాలలో 240 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. తదుపరి విద్యా సంవత్సరం నుండి ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 480కి పెంచేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో మొత్తం 4,800 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో 20 కొత్త బీసీ గురుకులాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అయితే తొలి విడతలో 10 పాఠశాలలకు మాత్రమే ఆమోదం లభించింది. బీసీ జనాభా అధికంగా ఉండి, ప్రస్తుతం గురుకుల పాఠశాలలు లేని నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని 8 జిల్లాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాల వారీగా కొత్త బీసీ గురుకులాల వివరాలు ఇలా ఉన్నాయి:
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బాలికల గురుకుల పాఠశాల, అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బాలికల గురుకుల పాఠశాల, పల్నాడు జిల్లా మాచర్లలో బాలికల గురుకుల పాఠశాల, మార్కాపురం జిల్లా గిద్దలూరులో బాలుర గురుకుల పాఠశాల, అనంతపురం జిల్లా గుంతకల్లులో బాలికల గురుకుల పాఠశాల, అన్నమయ్య జిల్లా రాయచోటిలో బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నారు.
కర్నూలు జిల్లాలో పత్తికొండలో బాలుర గురుకుల పాఠశాల, మంత్రాలయంలో బాలికల గురుకుల పాఠశాల, శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ, కదిరి ప్రాంతాల్లో బాలుర గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెనుకొండ, పత్తికొండ మినహా మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతం గురుకుల పాఠశాలలు లేవని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది అన్ని కొత్త గురుకుల పాఠశాలలను అద్దె భవనాల్లోనే ప్రారంభించనున్నారు. అనంతరం దశలవారీగా ప్రతి పాఠశాలకు సొంత భవనాలను నిర్మించే దిశగా బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం 10 నుండి 30 మందికి లోపు మాత్రమే విద్యార్థులు ఉన్న బీసీ వసతి గృహాలను గుర్తించి, అదే ప్రాంతాల్లో కొత్త గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులందరినీ కొత్త గురుకుల పాఠశాలల్లోనే చేర్చనున్నారు. ఈ విలీనంతో దాదాపు 60 బీసీ వసతి గృహాల నిర్వహణ భారం తగ్గి, ప్రభుత్వానికి ఏటా సుమారు 18 కోట్లు రూపాయల వ్యయం ఆదా కానుందని అధికార అంచనాలు సూచిస్తున్నాయి.













