రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు, రాత్రి చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జాతీయ రహదారులపై అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఈ దుర్ఘటనలు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రాప్తాడు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బొమ్మేపర్తి ఆర్చ్ సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామగిరి పేరూరుకు చెందిన దూదేకుల బాబు (34) అక్కడి కిరణాషాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య కుల్‌సుంబీ రామగిరి కస్తూర్బా స్కూల్‌లో వాచ్‌ఉమెన్‌గా పనిచేస్తోంది. బుధవారం రామగిరి నుంచి నాలుగేళ్ల కూతురు బానును తీసుకుని కుల్‌సుంబీ రాప్తాడు సర్కిల్ వద్ద దిగింది.
లింగనపల్లిలో ఉన్న దూదేకుల బాబు, భార్య, కూతురిని తీసుకెళ్లేందుకు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనంపై రాప్తాడు వచ్చాడు. అక్కడ నుంచి వారిని ఎక్కించుకుని లింగనపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా, బొమ్మేపర్తి ఆర్చ్ వద్ద జాతీయ రహదారిని దాటే సమయంలో పెనుకొండ వైపు నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో దూదేకుల బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారి బానును అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. గాయాలపాలైన కుల్‌సుంబీని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలియజేశాయి.
సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇక మరో ఘటనలో, తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తాడిపత్రి నుంచి గుత్తి వైపు వెళ్తున్న లారీ, గంగాదేవిపల్లి గ్రామం వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి అతివేగంగా వెళ్లింది. అదే సమయంలో గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన రామాంజులరెడ్డి ద్విచక్రవాహనంపై ఎదురుగా వస్తుండగా, లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామాంజులరెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తాడిపత్రి సీఐ తెలిపారు.













