రాయలసీమ న్యూస్, అనంతపురం: బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగుల కోసం జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించింది. ఈ నెల 17న తెల్లవారుజామున జరిగిన ఈ దొంగతనం జిల్లా కేంద్రానికి సమీపంలో, అదీ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉండే ఏటీఎంలో జరగడం కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, దుండగులు ఏటీఎంను బొలేరో వాహనానికి తాళ్లతో కట్టి లాగి తీసుకెళ్లారు. అనంతరం దానిని వాహనంలో ఎక్కించి గోవిందపల్లి, రేగడికొత్తూరు మార్గంగా ఆకులేడు వద్దకు తీసుకెళ్లి ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకుని పరారయ్యారు. ఈ దారుణం జరుగుతున్న సమయంలో రహదారిపై ఆటోలు, ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగినా, ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం దొంగలకు అనుకూలంగా మారింది.
చోరీకి 10 రోజుల ముందు నుంచే ఏటీఎంలో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఏటీఎంలలో నగదు నింపే సిబ్బంది, సీసీ కెమెరాలు మరమ్మతులు చూసే సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గోవిందపల్లి శివారులోని ఓ తోట వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దుండగులు ప్రయాణించిన బొలేరో వాహనం ఆనవాళ్లు లభించాయి. అయితే ఏటీఎంను ధ్వంసం చేసిన తర్వాత వారు ఎటువైపు వెళ్లారనే విషయాన్ని గుర్తించడం కష్టంగా మారింది.
దుండగులు సీసీ కెమెరాలు ఉన్న ప్రధాన రహదారులు కాకుండా గ్రామీణ రహదారుల మార్గంగా ప్రయాణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంను ఎత్తుకెళ్లిన తీరు, నైపుణ్యాన్ని బట్టి వారు హరియాణా ప్రాంతానికి చెందిన అంతర్రాష్ట్ర గ్యాంగ్ కావచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.
జిల్లా ఎస్పీ జగదీష్ ఈ కేసును సవాలుగా తీసుకుని నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు దిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారులపై ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను జల్లెడపడుతున్నారు. వాహనాల తనిఖీలను కూడా కట్టుదిట్టం చేశారు.
మండల వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు, బ్యాంకుల వద్ద రాత్రిపూట గస్తీని బలపరిచారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నాయి. కేసు పురోగతిపై వివరణ కోరగా, సీఐ సుబ్బరాయుడు కేసు విచారణ దశలో ఉందని, స్వయంగా ఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతానికి మరిన్ని వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని న్యూస్‌టుడేకి తెలిపారు.













