రాయలసీమ న్యూస్, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాల లో భాగంగా తాడిపత్రి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం యోగా సాధనతో సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో యోగా మాస్టార్లు డా. ఏ. మురళీకృష్ణ, రవిప్రసాద్, గోవిందరెడ్డి, మమతా కర్నూలు, ఎం. రాజశేఖర్ రెడ్డి, తిప్పయ్యలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, తాడిపత్రి మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ భూమా నాగరాగిణి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి యోగాసనాలు చేయించి వారికి స్ఫూర్తిని నింపారు.
జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా యోగా సాధనను విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు.
సాధారణంగా అరకు, గండికోట వంటి కొన్ని ప్రాంతాలే ప్రజలకు ఎక్కువగా గుర్తుండిపోతాయని, తాడిపత్రి వంటి ప్రాచీన దేవాలయాల ప్రాముఖ్యతను రాష్ట్రవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. తాడిపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా స్థానిక పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలకు మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే త్వరలో గుత్తి కోట వద్ద కూడా ఇలాంటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, అనేక రోగాలను దూరం పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఆర్డీఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ, యోగాంధ్ర జిల్లా AYUSH నోడల్ అధికారి డాక్టర్ లాల్య నాయక్, AYUSH వైద్యాధికారి డా. తిరుపతి నాయుడు, సివిల్ సప్లై డీఎం రమేష్ రెడ్డి, డ్వామా పీడీ సలీం భాష, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, తహసీల్దార్ రవిచంద్ర, ఎంపీడీఓ చలపతి, డీఈ రాంప్రసాద్ రెడ్డి, ఏఈలు నాగేంద్ర, తేజ, ఏక్నాథ్, ఎంఈఓలు నాగరాజు, రామ గోవిందరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు సాధన చేశారు.













