అమరావతి, అక్టోబర్ 5: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐదుగురు అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్ (టీసీడీ శేఖర్), జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణ రావులు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.

ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో సోమవారం పుల్ బెంచ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఐదుగురు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వీరికి ప్రమాణం చేయించారు.

రాష్ట్ర హైకోర్టులో ఐదుగురు శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ వెలువడిన తరువాతే సోమవారం ఈ ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

హైకోర్టులో ఇప్పటికే సేవలందిస్తున్న ఇతర గౌరవనీయ న్యాయమూర్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించిన తమ సహచరులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం పొందిన ఈ ఐదుగురు న్యాయమూర్తులు ఇంతకుముందు అదనపు న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. శాశ్వత నియామకాలతో హైకోర్టు న్యాయమూర్తుల బలం మరింతగా పెరిగింది. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కార ప్రక్రియకు ఇది తోడ్పడుతుందనే న్యాయవర్గాల అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా హైకోర్టు రిజిస్ట్రార్‌లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. నూతన శాశ్వత న్యాయమూర్తుల నియామకంతో హైకోర్టు పనితీరు మరింత సజావుగా సాగుతుందనే ఆశాభావం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది.