రాయలసీమ న్యూస్, సోషల్ మీడియా డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు గుర్తింపు, ఎంపానెల్‌మెంట్, పారితోషికం చెల్లింపుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. APDCL మరియు I&PR శాఖల ద్వారా అమలు చేయబోయే ఈ పాలసీ కింద రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా క్రియేటర్లకు అధికారిక మార్గదర్శకాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం స్పష్టంగా నిర్దేశించారు.
ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ , X (Twitter) ప్లాట్‌ఫామ్‌లపై కంటెంట్ రూపొందిస్తూ, అధికారిక APDCL ఎంపానెల్‌మెంట్ కోరుకునే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్క సోషల్ మీడియా క్రియేటర్‌కు ఈ పాలసీ వర్తిస్తుంది. అయితే వాట్సాప్ ఛానెల్స్, టెలిగ్రామ్ గ్రూపులకు ఈ పాలసీ వర్తించదని స్పష్టం చేశారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లను ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. కేటగిరి Aలో 1,00,000 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న అకౌంట్లు, కేటగిరి Bలో 50,000 నుండి 99,999 వరకు, కేటగిరి Cలో 25,000 నుండి 49,999 వరకు, కేటగిరి Dలో 10,000 నుండి 24,999 వరకు ఫాలోవర్లు ఉన్న అకౌంట్లు చేరతాయి.
పారితోషికం విషయంలో కూడా కేటగిరీ వారీగా గరిష్ట చెల్లింపులను నిర్ణయించారు. ప్రభుత్వం అందించే గ్రాఫిక్స్‌ను పోస్ట్ చేసినప్పుడు కేటగిరీ ఆధారంగా రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1,500 వరకు చెల్లిస్తారు. ప్రభుత్వం అందించే వీడియోలు పోస్ట్ చేసినప్పుడు రూ. 750 నుండి గరిష్టంగా రూ. 2,000 వరకు చెల్లింపు ఉంటుంది. క్రియేటర్ స్వయంగా కంటెంట్ తయారు చేసి, సంబంధిత అధికారుల ఆమోదంతో పోస్ట్ చేసిన సందర్భంలో కేటగిరి Aకి గరిష్టంగా రూ. 15,000, కేటగిరి Bకి రూ. 7,500, కేటగిరి Cకి రూ. 5,000, కేటగిరి Dకి రూ. 2,500 వరకు పారితోషికం నిర్దేశించారు.
అర్హత ప్రమాణాల పరంగా కనీసం ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌లో 10,000 మంది ఫాలోవర్లు ఉండాలి. కంటెంట్ నాణ్యత విషయంలో అశ్లీల, హింసాత్మక, దేశ వ్యతిరేక, పరువు నష్టం కలిగించే కంటెంట్ ఉండకూడదని నిబంధించారు. దరఖాస్తుదారుడి గత 60 పోస్టులను అధికారులు పరిశీలిస్తారు. అకౌంట్‌లో కనీసం రెండు పోస్టులు లేదా వీడియోలకు మొత్తం ఫాలోవర్ల సంఖ్య కంటే ఎక్కువ వ్యూస్ రావాలి. వారానికి కనీసం రెండు పోస్టులు చేస్తూ ఉండాలి; గత ఆరు నెలల్లో కనీసం 48 పోస్టులు ఉండాలి. అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలి; ప్రైవేట్ అకౌంట్లు అర్హులు కావు.
కేవలం వ్యక్తిగత ప్రొఫైల్స్, వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్స్‌కే అర్హత ఉంటుంది. కంపెనీలు లేదా సంస్థల పేరిట ఉన్న అకౌంట్లను ఎంపానెల్‌మెంట్‌కు పరిగణించరు. దరఖాస్తు సమయానికి కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ప్రభుత్వ పథకాల నిజాలను ప్రజలకు చేరవేయడం, నకిలీ వార్తలను తిప్పికొట్టడం వంటి బాధ్యతలను కూడా ఈ పాలసీ స్పష్టం చేస్తుంది.
ఎంపిక ప్రక్రియలో మొదట APDCL పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. అనంతరం స్టేజ్ 1లో గత 60 పోస్టుల కంటెంట్, గత 20 పోస్టుల ప్రమాణాలను అధికారులు పరిశీలిస్తారు. స్టేజ్ 2లో ఫాలోవర్ల సంఖ్య, వ్యూస్, వారానికి రెండు పోస్టులు చేస్తున్నారా లేదా అన్న మెట్రిక్స్‌ను చెక్ చేస్తారు. కనీసం ఐదుగురు సభ్యులతో కూడిన స్క్రూటినీ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయిస్తుంది. ఎంపికైన వారికి ఒక సంవత్సరం వ్యాలిడిటీ గల అధికారిక APDCL ఎంపానెల్‌మెంట్ కార్డ్ జారీ చేస్తారు.
ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెన్సర్ల (SMI) నమోదు కోసం ప్రత్యేక అధికారిక వెబ్‌సైట్ తయారీ దశలో ఉంది. ఈ పోర్టల్ పూర్తిగా సిద్ధమై, లైవ్‌లోకి వచ్చిన తర్వాతే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సంబంధిత శాఖలు సూచిస్తున్నాయి.






