రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడకు చెందిన లాయర్ కార్తిక్ సిద్ధార్థ సాలాది, తనను హైకోర్టు జడ్జిగా పరిచయం చేసుకుంటూ విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నం నగరంలో నమోదైన FIR No.115/2026 ప్రస్తుతం న్యాయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో లాయర్ కార్తిక్ సిద్ధార్థ సాలాది, అతని జూనియర్ లాయర్ గీతా ప్రసన్నతో పాటు మరికొందరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 111(1), 111(2), 204, 351(2), 351(3), 353(1), 61(1) మరియు 3(5) కింద కేసు నమోదు చేసినట్లు విశాఖపట్నం పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసు సమాచారం ప్రకారం, లాయర్ కార్తీక్ సిద్ధార్థ తన జూనియర్ లాయర్ గీతా ప్రసన్నపై ఇప్పటికే విశాఖపట్నంలో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నుండి బయటపడేందుకు కార్తీక్ సిద్ధార్థ, విశాఖపట్నం కమీషనర్ అఫ్ పోలీస్ ను సంప్రదించి బేరసారాలు జరపాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే CP ఇందుకు అంగీకరించకపోవడంతో పాటు అతనికి గట్టిగా హెచ్చరికలు చేసి పంపినట్లు పేర్కొంటున్నారు.
దీనిని మనసులో పెట్టుకున్న కార్తీక్ సిద్ధార్థ, విశాఖపట్నం CP ను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నినట్లు కేసు వివరాల్లో వెల్లడైంది. CP ను తన జూనియర్ లాయర్ గీతా ప్రసన్న ద్వారా ట్రాప్ చేయాలని ప్రయత్నించినా ఆ యత్నం విఫలమైంది. ఆ తర్వాత కూడా ఆగకుండా, కొంతమంది స్థానిక విలేకరులతో కలిసి తనను హైకోర్టు జడ్జిగా చెప్పుకుంటూ, విశాఖపట్నం కమీషనర్ బైటికోయిన్స్ తీసుకున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ, కమిషనర్‌ను బెదిరించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, మీడియా సంస్థల చుట్టూ తిరుగుతూ, CPపై వరుసగా తప్పుడు వార్తలు ప్రచురించేందుకు రూ.10 లక్షలు ఇవ్వడానికి సిద్ధమని కార్తీక్ సిద్ధార్థ ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే అతని చర్యలను కొంతమంది మీడియా ప్రతినిధులు వీడియో, ఆడియో వంటి ఆధారాలతో రికార్డు చేసి, సంబంధిత సాక్ష్యాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా, తమను హై కోర్ట్ జడ్జ్ అని తప్పుడు ప్రచారం చేసుకున్న కార్తిక్ సిద్ధార్థ సాలాది, అతని సహచరులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితురాలైన లాయర్ గీతా ప్రసన్నను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ప్రధాన నిందితుడు కార్తీక్ సిద్ధార్థ పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.







