రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని KL యూనివర్సిటీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. వర్సిటీ లైబ్రరీ భవనంలో నాలుగో అంతస్తులో ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఎసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. అనంతరం నాలుగో అంతస్తు నుంచి అగ్నికీలలు బయటకు కనిపించడంతో లైబ్రరీ భవన పరిసరాల్లో ఉన్న విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. లైబ్రరీ నుంచి బయటకు పరుగులు తీసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
లైబ్రరీ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు స్వయంచాలకంగా పనిచేశాయి. వాటి నుంచి వచ్చిన నీటి తుంపర్లు కొంత మేరకు మంటలను అదుపు చేయడంలో సహాయపడ్డాయి. దీంతో మంటలు ఇతర అంతస్తులకు, లైబ్రరీలోని ఇతర విభాగాలకు వ్యాపించే ప్రమాదం తగ్గింది.
అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది మంగళగిరి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రాణనష్టం ఏదీ సంభవించలేదని ప్రాథమిక సమాచారం. మంటలు చెలరేగిన నాలుగో అంతస్తు ఎసీ భాగంలో మాత్రమే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది, వర్సిటీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, షార్ట్ సర్క్యూట్ కారణాలను నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు.
అగ్నిప్రమాదం సమయంలో లైబ్రరీలో ఉన్న విద్యార్థులు, సిబ్బంది సకాలంలో బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ సేఫ్టీ పరికరాలు సమయానికి పనిచేయడం, అగ్నిమాపక సిబ్బంది తక్షణ స్పందనతో మంటలను అదుపు చేయగలిగారు. ఘటనపై సంబంధిత అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.







