స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలి: డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు ముందుగానే సమగ్ర సన్నాహాలు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోపే అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తే, పోలింగ్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం గుంటూరు పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై ప్రాంతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐజీపీ లా అండ్‌ ఆర్డర్‌ మధుసూదన్‌రెడ్డి, ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు రేంజ్‌ డీఐజీ ఫకీరప్ప, డీఐజీ లా అండ్‌ ఆర్డర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని 18 మండలాలు, 257 గ్రామపంచాయతీలు, 16 జడ్పీటీసీలు, 248 ఎంపీటీసీలు; పల్నాడు జిల్లాలోని 28 మండలాలు, 525 గ్రామపంచాయతీలు, 28 జడ్పీటీసీలు, 434 ఎంపీటీసీలు; బాపట్ల జిల్లాలోని 20 మండలాలు, 346 గ్రామపంచాయతీలు, 20 జడ్పీటీసీలు, 297 ఎంపీటీసీలతో పాటు మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేపట్టారు.

ప్రకాశం జిల్లాలో 516 గ్రామపంచాయతీలు, 27 జడ్పీటీసీలు, 377 ఎంపీటీసీలు, ఐదు మున్సిపాలిటీలు, మార్కాపురం జిల్లాలో 46 గ్రామపంచాయతీలు, 21 జడ్పీటీసీలు, 275 ఎంపీటీసీలు, నెల్లూరు జిల్లాలో 976 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాల్సిన ఎన్నికల సన్నాహకాలపై కూడా సమావేశంలో చర్చించారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలో వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను ముందుగానే గుర్తించాలని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, బ్యాలెట్‌ బాక్సుల రక్షణ, తరలింపు, స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలని డీజీపీ సూచించారు. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం, వదంతులు, రెచ్చగొట్టే ప్రచారం వ్యాప్తి చెందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

రాజ్యాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికల నిర్వహణ జరగాలని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఐపీఎస్‌ జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికల సన్నాహకాలపై డీజీపీకి వివరాలు అందించారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు.

సమావేశంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.