నెల్లూరు : పేదరికం, అనారోగ్యం కాటేసిన ఒక కుటుంబంలో తొమ్మిదేళ్ల బాలుడు వెట్టిచాకిరికి గురైన ఘటనకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తక్షణంగా స్పందించడంతో ఆ బాలుడికి విముక్తి లభించింది. గొర్రెలు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ బాలుడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికార యంత్రాంగం కదిలింది. బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో పాటు అతని కుటుంబానికి ప్రభుత్వం సహాయహస్తం చాపింది.

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన పురుష ఆశీర్వాదం, ఎస్తేరమ్మ దంపతులు ప్రస్తుతం నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నర్రవాడలో నివసిస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల రామయ్యతో పాటు మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రామయ్యకంటే చిన్నవారైన ఆడపిల్లల్లో ఒకరికి గుండె సంబంధిత వ్యాధి ఉండటంతో కుటుంబంపై ఆర్థిక భారం మరింత పెరిగింది. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ డబ్బాలు ఏరుకుని రోజువారీ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో తమ కుమారుడు రామయ్యను ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం బూరేపల్లి కాలనీకి చెందిన కన్నెబోయిన నాగయ్య వద్ద గొర్రెలు కాసేందుకు జీతానికి పెట్టారు. ఇందుకోసం నాగయ్య వారికి రూ.35 వేల్ని ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం మధ్యవర్తుల ద్వారా జరిగిందని తెలిసింది. వారం రోజుల క్రితం రామయ్యను బూరేపల్లిలోని నాగయ్య ఇంటి వద్ద వదిలి తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి నాగయ్య తన గొర్రెలు కాసేందుకు రామయ్యను పొలాలకు పంపిస్తున్నాడు.

మండుటెండలో గొర్రెలు కాస్తూ, సరైన ఆహారం కూడా అందక ఇబ్బంది పడుతున్న రామయ్యను చూసిన స్థానికులు చలించిపోయారు. రెండు రోజుల క్రితం పొలాల్లో గొర్రెలు కాస్తూ ఏడుస్తున్న రామయ్య దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో రామయ్య తనకు సరైన భోజనం కూడా పెట్టకుండా పనిచేయిస్తున్నారని వాపోతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయింది.

ఈ వీడియోను గమనించిన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ వెంటనే ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ, ఆ బాలుడిని వెంటనే తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని ఆదేశించారు. దీంతో నెల్లూరు కలెక్టర్‌ హిమాంశు శుక్లా, ప్రకాశం కలెక్టర్‌ రాజాబాబు సంబంధిత అధికారులను చర్యలకు దింపారు.

రాజాబాబు ఆదేశాల మేరకు స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బాలల సంరక్షణ కమిటీ ప్రతినిధులు గురువారం బూరేపల్లి కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలిసిన నాగయ్య అధికారులు రాకముందే రాత్రికి రాత్రే రామయ్యను అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. అనంతరం రెండు జిల్లాల అధికారులు దత్తలూరు వెళ్లి రామయ్యను నెల్లూరు జిల్లా సీడబ్ల్యూసీ కమిటీ ముందు హాజరుపరిచారు. కమిటీ సూచనల మేరకు బాలుడిని తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంచారు.

ఈ ఘటనపై మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో స్పందించారు. రామయ్యను ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు, తండ్రి అనారోగ్యానికి వైద్యం అందించేలా చూస్తున్నట్టు, తల్లికి స్వయం ఉపాధి కల్పించనున్నట్టు ఆయన పోస్టు చేశారు. వెంటనే స్పందించి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నెల్లూరు కలెక్టర్‌ హిమాంశు శుక్లా, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి ఆదేశాల మేరకు అధికారులు దత్తలూరు మండలం నర్రవాడలో ఆశీర్వాదం, ఎస్తేరమ్మ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేశారు. వారికి వెలుగు పథకం కింద రుణం కూడా అందజేశారు. ఇదిలా ఉండగా, బాలుడిని చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న కన్నెబోయిన నాగయ్యపై మద్దిపాడు పోలీసు స్టేషన్లో బాల కార్మిక చట్టం, జస్టిస్‌ జువైనల్‌ చట్టం కింద గురువారం కేసు నమోదు చేశారు.