అమరావతి : రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సేవల ద్వారా పౌరులు తమ మొబైల్ ఫోన్ ద్వారా నేరుగా కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ముందుగా 9552300009 మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నంబరుకు "Hi" అని సందేశం పంపాలి. అనంతరం వచ్చే మెను నుంచి అవసరమైన సేవలను ఎంపిక చేసుకోవాలి. అందులో రెవెన్యూ సేవల ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రెవెన్యూ సేవలలో ఉన్న "Re-issuance of Integrated Certificate" అనే ఆప్షన్‌ను ఎంపిక చేసిన తర్వాత ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆధార్ నంబర్ ఇచ్చిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి, తదుపరి స్క్రీన్‌లో కోరిన కొన్ని వివరాలు పొందుపరచాలి.

అవసరమైన వివరాలు నమోదు చేసిన తర్వాత కుల ధృవీకరణ పత్రం కోసం రూ.40 రుసుము చెల్లించాలి. రుసుము చెల్లింపు పూర్తయిన వెంటనే సంబంధిత కుల ధృవీకరణ పత్రం పౌరుల మొబైల్ ఫోన్‌లో డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా కార్యాలయాలకు వెళ్లకుండా, తాము ఉన్న చోటు నుంచే ఎప్పుడైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను డిజిటల్ విధానంలోకి తీసుకురావడం వల్ల ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, ఇతర ప్రభుత్వ పథకాల కోసం అవసరమయ్యే కుల ధృవీకరణ పత్రాలను తక్షణమే పొందేందుకు ఈ సేవ ఉపయోగపడనుందని తెలిపారు.

పౌరులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీజీఎస్ అధికారులు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ సేవ ద్వారా ఎక్కువ మంది ప్రయోజనం పొందగలరని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.