ఆరు రోజులుగా జాడలేని చిన్నారి జాహ్నవి..

మిస్టరీగా తుని మిస్సింగ్ కేసు

కాకినాడ జిల్లా తుని సమీపంలోని సీహెచ్ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం స్థానికులను, కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్థులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో ఈ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది.

దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో ఉన్న పామాయిల్ తోటలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న జాహ్నవి, ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పరిసర ప్రాంతాలన్నీ వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి పోలీసులు, స్థానికులు నిరంతర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నా ఎలాంటి క్లూ దొరకలేదు.

చిన్నారి అడవిలో ఎక్కడైనా చిక్కుకుపోయిందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక మరేదైనా అనుకోని ఘటన జరిగిందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకక అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాహ్నవి కుటుంబం నివసిస్తున్న ప్రాంతం చుట్టూ దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ తోటలు ఉండగా, ఆ తర్వాత వెంటనే కొండ ప్రాంతం, దట్టమైన అడవి ప్రారంభమవుతుంది. ఈ మొత్తం పరిధిలోనే విస్తృత గాలింపు చేపట్టారు.

దట్టమైన పొదలు, లోతైన నేలబావులు, చెరువులు, గుంతలు అన్నింటినీ జల్లెడ పట్టారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పై నుంచి కూడా విస్తృతంగా శోధించారు. చిన్నారి అదృశ్యమైన మరుసటి రోజే కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో మట్టిపెళ్లలు విరిగిపోయిన ప్రాంతాల్లో ప్రత్యేక శోధనలు నిర్వహించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లభించకపోవడం విచారణను మరింత క్లిష్టతరం చేసింది.

ఈ కేసులో ఆశాకిరణంగా మారిన పెంపుడు కుక్క ప్రవర్తన ప్రస్తుతం కొత్త సందిగ్ధతను సృష్టిస్తోంది. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి కనిపించకుండా పోయిన ఆ కుక్క రెండు సార్లు ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో జాహ్నవి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో అది కీలకంగా మారుతుందని పోలీసులు భావించారు. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి తిరిగి వదిలిపెడితే అది వెళ్లే దారిని అనుసరించి చిన్నారి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.

అయితే బుధవారం రాత్రి రెండోసారి ఇంటికి వచ్చిన కుక్క ప్రవర్తనలో మార్పులు కనిపించాయని డాగ్ క్యాచర్స్ బృందం తెలిపింది. జనాలను చూసి భయపడటం, అసహజంగా వ్యవహరించడం గమనించిన అధికారులు, ట్రాకర్ అమర్చి విడిచిపెట్టే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. కుక్క మానసిక స్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇవాళ దాని ప్రవర్తన సాధారణంగా ఉంటే ట్రాకర్ అమర్చి వదిలిపెట్టి, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అడవిలోకి వెళ్లే అవకాశముందని సమాచారం.

ఇక జాహ్నవి తల్లి భవానీ పడుతున్న వేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. బోనులో ఉన్న కుక్క దగ్గరకు వెళ్లి చిన్నారిని గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుతున్న ఆమె దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.

" జాను దగ్గరికి వెళ్తావా "అని పదేపదే అడుగుతున్న భవానీ, కుక్క తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ కూడా వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

"కుక్క తిరిగి వచ్చినపుడు నా బిడ్డ కూడా వస్తుందని అనుకున్నాను . కుక్కను వదిలిపెడితే అది జాను ఉన్న చోటుకి తీసుకెళ్తుందని నమ్మకం ఉంది". అని భవానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరుగుతోంది. ఆరు రోజులుగా చిన్నారి ఆచూకీ లేకపోవడం, విస్తృత గాలింపులోనూ ఒక్క ఆధారం దొరకకపోవడం పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి కోణంలో విచారణ కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఏదో ఒక కీలక సమాచారం లభిస్తుందనే ఆశతో ఉన్నారు. జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.