రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ఇటీవల రూ.30 వేల కోట్ల వ్యయంతో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనుల వివరాలను సీఎం ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు. ఈ రెండు కీలక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమయానికి విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీలో వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయని సీఎం వివరించారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన కేంద్ర మంత్రికి తెలియజేశారు.
ఆ రెండు రాష్ట్రాల్లో పోలవరం నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సిన ప్రొటెక్టివ్ ఎంబాంక్మెంట్స్ పనులకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందని, ఈ కారణంతో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్ ప్రస్తుతం అబెయన్సులో ఉన్నప్పటికీ దాన్ని శాశ్వతంగా ఉపసంహరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఒప్పించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. మూడు రాష్ట్రాల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర సహకారం, సమన్వయం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్టు సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో, నిర్వాసితుల సమస్యల పరిష్కారం, పునరావాస పనులకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. పోలవరానికి ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని ఆయన సీఆర్ పాటిల్‌ను కోరారు.
పోలవరం వద్ద 45.72 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. గోదావరి నది నుంచి వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయని, ఆ నీటిని సద్వినియోగం చేసుకునేలా పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టును పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
ఇటీవల ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులను ప్రారంభించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలో మొత్తం 95 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా, వాటిలో 62 లక్షల ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, తాజాగా 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించేలా పనులకు శంకుస్థాపన చేసినట్టు ఆయన వివరించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పనుల పురోగతికి అనుగుణంగా సత్వరం నిధులు విడుదల చేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు.
నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను కూడా ఈ సమావేశంలో చంద్రబాబు సీఆర్ పాటిల్‌కు వివరించారు. నీటి వనరుల సమర్థ వినియోగం, రాష్ట్రాల మధ్య సహకారం ద్వారా దీర్ఘకాలిక నీటి సమస్యలను తగ్గించుకోవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.







