ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ) వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు , SPలు, వివిధ నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల ZPP CEOs, DPOలు, నగర, పట్టణ మునిసిపల్ కమిషనర్ల పాల్గొననున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, లాజిస్టిక్‌ సదుపాయాలు, ఓటర్ల సౌకర్యాలు వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం నుంచి వివరాలు తీసుకుని, అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఎస్ఈసీ వర్గాలు సూచిస్తున్నాయి.

మూల షెడ్యూల్‌ ప్రకారం ఈ సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా ఎస్ఈసీ సమావేశాన్ని ఒక రోజు వాయిదా వేసి గురువారానికి మార్చారు. దీంతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష రేపటికి జరగనుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఎస్ఈసీ ఈ సమావేశాన్ని అత్యంత కీలకంగా భావిస్తోంది. జిల్లాల వారీగా ఏర్పాట్లలో ఉన్న లోపాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.