రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు భారీ ఎత్తున “ఛలో విజయవాడ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతి లేదని స్పష్టంగా తెలియజేశారు.

ఉద్యోగులు సమూహాలుగా విజయవాడకు చేరుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. ఇప్పటికే వందిమందికి పైగా ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఉద్యోగులను మార్గమధ్యంలోనే అడ్డుకుని పోలీసు స్టేషన్లకు తరలించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇద్దరు యూనియన్ నేతలపై ప్రభుత్వం వేటు వేసింది. వారి కార్యకలాపాలు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు భావించినట్టు తెలుస్తోంది. ఈ చర్యతో ఉద్యోగ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

విజయవాడకు వెళ్లేందుకు అనుమతి లేదని, అయినా ధర్నాకు వెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉద్యోగుల గ్రూపుల్లో అధికారులు హెచ్చరించినట్టు సమాచారం. సోషల్ మీడియా గ్రూపులు, మెసేజ్‌ల ద్వారా ఉద్యోగులకు ఈ హెచ్చరికలు చేరుతున్నాయి. అధికారుల ఈ హెచ్చరికలతో ఉద్యోగుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంది.
పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని, తమ డిమాండ్లను వినిపించుకునేందుకు శాంతియుతంగా ధర్నా చేయాలని ఉద్యోగులు భావిస్తున్నప్పటికీ, అనుమతుల సమస్య, పోలీసుల అడ్డంకులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, ప్రభుత్వం మాత్రం చట్టం, శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది.







