నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం అక్రమ వేట కార్యకలాపాలతో ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా ఈ జలాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న స్థానిక మత్స్యకారుల జీవనాధారం ప్రమాదంలో పడుతోంది. ప్రభుత్వం నుంచి అధికారిక లైసెన్స్ పొందిన మత్స్యకారులు ప్రతిరోజూ వేట కోసం అమర్చే వలలు, బుట్టలు రాత్రికి రాత్రే మాయమవుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అక్రమ వేటగాళ్లు స్థానిక మత్స్యకారుల వలలను దొంగలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఈ జలాశయంలో వేటాడే హక్కు స్థానిక లైసెన్స్ పొందిన మత్స్యకారులకే పరిమితం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వందల సంఖ్యలో లైసెన్స్ లేని వ్యక్తులు జలాశయంలో యథేచ్ఛగా వేట సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి బడా వ్యాపారస్తులు మత్స్యకారులను రప్పించి, నిషేధిత అలివి వలలు ఉపయోగిస్తున్నారని సమాచారం. ఈ వలలతో చిన్న చేప పిల్లలతో సహా మొత్తం మత్స్య సంపదను సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీతో జలాశయంలో చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు, భవిష్యత్తులో మత్స్య సంపద పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

మత్స్యశాఖ మరియు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు ఈ అక్రమాలను అరికట్టడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడా వ్యాపారస్తులు ఇచ్చే మామూళ్లకు కొందరు అధికారులు అమ్ముడుపోతున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అక్రమ వేట, వలల దొంగతనాలపై అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే పరిస్థితి ఇంత దారుణంగా మారిందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.

పత్రికలలో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే నామమాత్రపు తనిఖీలు చేసి, తర్వాత మళ్లీ పాత పరిస్థితులకే చేరుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోకుండా, పైపై తనిఖీలతోనే సరిపెట్టుకోవడం వల్ల అక్రమ వేటగాళ్లకు మరింత ధైర్యం వస్తోందని వారు అంటున్నారు.

తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న లైసెన్స్ లేని ముఠాలను తక్షణమే అరికట్టాలని, తమ వలల దొంగతనాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, అవినీతిలో పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, సోమశిల జలాశయం వద్ద గస్తీ పెంచి మత్స్య సంపదను, స్థానిక మత్స్యకారుల హక్కులను కాపాడాలని వారు కోరుతున్నారు.