విశాఖపట్నం: అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉత్తరాంధ్రను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కొత్త రాజకీయ పార్టీ ద్వారా కృషి చేస్తానని రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు వేణుంబాకం విజయ సాయి రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాలపై విస్తృతంగా మాట్లాడారు.

తన రాజకీయ జీవితం ఉత్తరాంధ్రతో ముడిపడి ఉందని, విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నానని ఆయన పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీకి మూడో ప్రత్యామ్నాయం అవసరమని, ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

రాయలసీమకు నెలకు 350 కోట్లు రూపాయలు తరలిస్తున్నారని, కేంద్రంలో మంత్రి పదవుల కోసం టీడీపీ సిద్ధమవుతోందని, వారికి సిద్ధాంతం లేక పదవులే ముఖ్యమని వ్యాఖ్యానించారు. లోకేష్, జగన్ లక్ష్యం సీఎం పదవే అని ఎద్దేవా చేశారు. గ్రీన్ ఫీల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాకపోవడం, సంపద రెండు కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకృతమవుతుండడాన్ని ఆయన ప్రశ్నించారు. ఉపాధి కల్పన ఎక్కడో అడిగారు.

ఎయిర్ పోర్ట్, గూగుల్ వంటి ప్రాజెక్టుల ఘనత తమదేనని వైసీపీ, టీడీపీ పరస్పరం గొడవపడుతున్నప్పటికీ, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. యువత మూడో ప్రత్యామ్నాయాన్ని గుర్తించిందని, రెడ్ బుక్, రఫ్ఫా రఫ్ఫా వంటి వ్యవహారాలకు చోటు ఉండదని తెలిపారు. కుల పిచ్చి పార్టీలు కావాలా అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. యువతరం నుంచే పాలకులు రావాలని, తాను సీఎం అభ్యర్థి కాదని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు కమ్మ, క్రిస్టియన్ పాలకులే ఉన్నారని, బడుగు వర్గాలకు అధికారం దక్కలేదని, రెండు పార్టీలకు కులం, మతం పిచ్చి ఉందని విమర్శించారు. ఆంధ్రా యూనివర్సిటీ తన మనసులో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, గీతం అభివృద్ధే సీఎంల లక్ష్యమైందని, ఏయూని దెయ్యాల కొంపగా అభివర్ణించిన దివంగత ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.

54.79 ఎకరాలు, సుమారు 5 వేల కోట్ల విలువైన భూమిని గీతంకి ఎలా దారాదత్తం చేశారని ప్రశ్నించారు. ఎంపీ భరత్ వెయ్యి కోట్లు అన్నారని, సర్కార్‌కు ఎంత చెల్లించారో వెల్లడించాలన్నారు. దేశ విభజనకు కారణం కాంగ్రెస్ అని, అలాంటి కాంగ్రెస్‌తో వైసీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందో ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ మహా నటులని వ్యాఖ్యానించారు.

సీఆర్డీఏ, అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఇప్పటికే 70 వేల కోట్లు ఖర్చు చేసి, పరిమితి లేని అప్పులు చేస్తున్నారని తెలిపారు. ఈ రుణ భారం ఉత్తరాంధ్ర, రాయలసీమపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో 10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నీటి పారుదల, వలసల నివారణ, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతామని చెప్పారు.

ఉద్దానంలో నేటికీ ఆపరేషన్లు చేసే సౌకర్యం లేదని, ప్రజలకు సురక్షిత తాగునీరు అందుబాటులో లేదని ఆయన పేర్కొన్నారు. శారదా, వేగవతి తదితర నదులను అనుసంధానం చేసి, ఆక్రమణలు తొలగించి కరువు సమస్యను తగ్గిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర జనాభా 19 శాతం ఉన్నప్పటికీ, వంశధారలో 600 టీఎంసీల నీరు వినియోగం కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 2800 పంచాయతీలకు నీరు, రోడ్లు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎకరం 99 పైసలకే భూములు ఇవ్వడం కంటే పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, ఆదివాసీలకు సంబంధించిన జీవో నంబర్ 5ను చట్టబద్ధం చేస్తామని, గంజాయి సాగును నిర్మూలించి, గిరిజన సంస్కృతిని కాపాడతామని తెలిపారు. 1994, 1999 నుంచి 2004లో వాజ్ పేయి హయాంలో పని చేసిన దిలీప్ మతమార్పిడి ప్రయత్నాల నిర్మూలనకు కృషి చేస్తున్నారని, వారిని మళ్లీ ఆదివాసీ సమాజంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

విశాఖకు ఆ రెండు కుటుంబాలు చేసినది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. రాజధాని విషయంలో మాట తప్పిన వైసీపీ ఇప్పుడు మావిగన్ అంటూ యూటర్న్ తీసుకోవడం ఉత్తరాంధ్రకు అన్యాయమని, దీనిపై వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి రియల్ ఎస్టేట్‌గా మారిన తుమ్మపాల, గోవాడ ఫ్యాక్టరీల రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని, రైవాడ భూములు ఇచ్చిన వారికి నీరు అందడం లేదని విమర్శించారు.

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన శ్రీకృష్ణ కమిటీ ఒక బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజల ఓట్లు తొలగించడం లేదని, ఈ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. నేడు పిల్లలు మొబైల్‌కు బానిసలవుతున్నారని, సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. త్వరలో ఉత్తరాంధ్ర అంతటా పాదయాత్ర చేపట్టి, స్థానిక సమస్యలను తెలుసుకుని ముందుకు వెళ్తామని ప్రకటించారు.