రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: టీడీపీ కార్యకర్తలు చేసిన దాడికి గురైన ఎంపీ మిథున్‌పై జరిగిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ హింస, చట్టవ్యవస్థ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరగాలన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్ జగన్ విమర్శించారు. రెండున్నరేళ్ల పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో, ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు, దాడులకు పాల్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
హింసా రాజకీయాలు చంద్రబాబు నాయుడికి కొత్తేమీ కాదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌లా మార్చేశారని, లోక్‌సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగంతో పోలీసు వ్యవస్థను వాడుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. దాడులు జరుగుతున్న సమయంలో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా, నిర్వీర్యంగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ అన్యాయాలను సమర్థంగా ఎదుర్కొంటామని, చట్టపరంగా అన్ని విధాలుగా పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ధైర్యం, సహనంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోర్టుల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు.
పారామిలటరీ బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు సజావుగా సాగుతాయని, ఇదే విషయాన్ని కోర్టుల ముందు ప్రస్తావించనున్నట్లు వైఎస్ జగన్ సూచించారు. హింసతో రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడిదేనని ఆయన విమర్శించారు.
హింసతో రాష్ట్రాన్ని నాశనంచేస్తున్న చరిత్ర చంద్రబాబుది.
ఎంపీ మిథున్‌పై టీడీపీ మూకల దాడి నేపథ్యంలో వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.







