రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా పోలీసు శాఖ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పెనగలూరు మండల పరిధిలో 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీ ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ఈ ప్రత్యేక నిఘా చర్యలలో భాగంగా, పెనగలూరు మండల పరిధిలోని బెస్తపల్లి గ్రామ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. శ్రీనివాసులు, పెనగలూరు ఎస్‌ఐ శ్రీ అరుణ్ కుమార్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది అరెస్ట్ చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 6.5 కిలోల గంజాయి, ఒక టాటా సుమో వాహనం, మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
అరెస్టు చేసిన నిందితులు: కంచర్ల సుబ్బారెడ్డి (71) – పెనగలూరు మండలంలోని చక్రంపేట గ్రామం; తోడేటి శేఖర్ @ బుజ్జి (50) – రాజంపేట మండలంలోని బోయినపల్లి గ్రామం; వడివేలు శీలంబర్సన్ @ అజయ్ (37) – సెనగతకులం, వడమధురై పోస్ట్, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బారాయుడు, నందలూరు మండలంలోని నల్లతిమ్మయ్యగారిపల్లి గ్రామానికి చెందినవాడు.
ప్రాథమిక విచారణలో నిందితులు గంజాయిని సేకరించి పరిసర గ్రామాలు మరియు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు బయటపడింది. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన నిర్వాహకులు, సరఫరా మార్గాలు, ఆర్థిక లావాదేవీలు మరియు సంబంధిత నెట్‌వర్క్‌ను పూర్తిగా వెలికితీసేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత అవసరమని జిల్లా పోలీసులు పేర్కొన్నారు. యువత భవిష్యత్తును పరిరక్షించడం, మాదకద్రవ్యాల బారిన పడుతున్న కుటుంబాలను కాపాడడం, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీసు శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.













