రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న నలుగురు దుండగులు, ఏకంగా ఏటీఎం మిషన్‌నే బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లడం ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది.
అర్ధరాత్రి వేళ బొలెరో వాహనంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చేరుకున్న దుండగులు ముందుగా ఏటీఎంను పెకలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏటీఎం వద్ద అనుమానాస్పద కదలికలను గమనించిన కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
స్థానికులు ఎదుర్కొనే ప్రయత్నం చేయడంతో దుండగులు గన్ చూపించి బెదిరింపులకు దిగినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెనక్కి తగ్గగా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దుండగులు ఏటీఎం మిషన్‌ను బొలెరో వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
దొంగతనం మొత్తం ఘటనను ఎదురింటిలో ఉన్న కొంతమంది స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోగా రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారాయి. అదనంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు.
ప్రారంభ దర్యాప్తులో దొంగలు బొలెరో వాహనం (AP28TB2281) లో ఏటీఎంను కొంతదూరం తరలించిన తర్వాత, అక్కడి నుంచి మరో కంటైనర్ వాహనంలోకి షిఫ్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మార్గంలో దుండగులు ప్రయాణించిన దిశ, వారు వెళ్లి ఉండే అవకాశమున్న ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ సంబంధిత పోలీసు స్టేషన్లకు అలర్ట్ జారీ చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా పరిధిలోని చెక్‌పోస్టులు, ముఖ్య రహదారులపై వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు.
ఏటీఎంలో ఉన్న నగదు మొత్తం, దొంగతనం జరిగిన ఖచ్చితమైన సమయం, దుండగుల కదలికలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.













