జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు..

అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ హెచ్చరిక

మదనపల్లి : జనాభా లెక్కల పేరుతో కొత్త రకం సైబర్ మోసాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు రోజుకో కొత్త పంథా అవలంబిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో సైబర్ కేటుగాళ్లు జనాభా లెక్కల నమోదు అధికారులమంటూ ప్రజలకు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ లింకుల ద్వారా సంప్రదిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్టు ఆయన వివరించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిజిటల్ సర్వే చేస్తున్నామని నమ్మబలికి, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరిస్తున్నారని ఎస్పీ తెలిపారు. అనంతరం బాధితుల మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలు అడిగి, క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఎప్పటికీ ఫోన్ కాల్స్ ద్వారా గానీ, అనుమానాస్పద లింకుల ద్వారా గానీ బ్యాంకు వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు కోరదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి, ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలకు లోనుకాకుండా ఉండాలని పిలుపునిచ్చారు.

మొబైల్ ఫోన్లకు వచ్చే ఎటువంటి అపరిచిత లింకులపై క్లిక్ చేయకూడదని ఎస్పీ హెచ్చరించారు. ఒకవేళ పొరపాటున ఇలాంటి సైబర్ మాయగాళ్ల బారిన పడి ఎవరైనా ఆర్థిక నష్టం చవిచూస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే, అంత వేగంగా పోయిన సొమ్మును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలదని, ప్రతి కుటుంబం ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.

జనాభా లెక్కల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు అడిగితే వెంటనే కాల్‌ను నిలిపివేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పౌరులను కోరారు.