ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026లో బీఎల్ఓల పాత్ర కీలకం: జిల్లా రెవెన్యూ అధికారి

మదనపల్లె : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం SIR-2026ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి పర్యవేక్షకులు కీలక పాత్ర పోషించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసం ఇంటింటి గణన ప్రక్రియను నిబంధనల మేరకు, అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

SIR-2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మదనపల్లె మండలంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మదనపల్లె నియోజకవర్గానికి చెందిన బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి పర్యవేక్షకులకు డివిజన్ స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, నియోజకవర్గ తహసీల్దార్లు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14, 2026 వరకు జరగనున్న ఇంటింటి గణన కార్యక్రమంలో ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించాలని బీఎల్ఓలకు సూచించారు. ఇప్పటికే నమోదైన ఓటర్లకు ముందస్తుగా ముద్రించిన గణన పత్రాలను రెండు ప్రతులుగా అందజేసి, వాటిని సక్రమంగా పూరించేందుకు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. గణన సమయంలో ఇళ్లు తాళం వేసి ఉండటం, లేదా కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితుల్లో సంబంధిత గణన పత్రాలను అక్కడే ఉంచి, వాటిని తిరిగి సేకరించేందుకు కనీసం మూడు సార్లు ఆ ఇంటిని సందర్శించాలని బీఎల్ఓలకు ఆదేశించారు. ప్రతి అర్హ ఓటరు వివరాలు తప్పకుండా నమోదు కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఓటర్లు గణన పత్రాలను ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కలిసి అప్లోడ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని డీఆర్ఓ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ఓటర్ల వివరాలను బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ధృవీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఓటర్ల నుంచి గణన పత్రాలను స్వీకరించిన ప్రతిసారి తప్పనిసరిగా రసీదు అందజేయాలని డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి బీఎల్ఓలకు సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో నియోజకవర్గ తహసీల్దార్లు, ఎన్నికల శాఖ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి పర్యవేక్షకులు పాల్గొన్నారు.