మదనపల్లె పట్టణంలో గ్యాస్‌ సిలిండర్‌ రిపేర్‌ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని రామనగర్‌లో నివాసముంటున్న నరసింహులు, శారద ఇంట్లో కొద్దిరోజులుగా గ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో గ్యాస్‌ సిలిండర్లు, స్టౌలు రిపేర్‌ చేసే మెకానిక్‌ అయిన స్థానిక అప్పారావు తోటకు చెందిన ఆయాజ్‌ (52) శనివారం ఉదయం శారద నివాసం ఉన్న వీధికి వచ్చాడు. ఇంటి వద్దకు వచ్చిన ఆయాజ్‌కు శారద తమ ఇంట్లో ఉన్న సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతున్న విషయాన్ని తెలియజేసి, దాన్ని రిపేర్‌ చేయాలని కోరింది.

దీంతో ఆయాజ్‌ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చి రిపేర్‌ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో సిలిండర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో అక్కడే ఉన్న మెకానిక్‌ ఆయాజ్‌తో పాటు శారద సైతం తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన ఇద్దరినీ స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆయాజ్‌ గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ఘటన స్థలానికి చేరుకున్న రెండవ పట్టణ పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. గ్యాస్‌ సిలిండర్‌లో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై వారు విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, సంఘటన స్థల పరిస్థితుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.