మదనపల్లి : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ స్థాయిలో భూమి మోసం కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్ పుస్తకాలతో మోసగించిన ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ వివరించారు.

కదిరి – పలమనేరు జాతీయ రహదారి పక్కన బసినికొండ పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 2.52 ఎకరాల భూమిని (సర్వే నంబర్లు 773/D, 773/2C, 773/B, 773/2A, 553/1C3) కేవలం రూ. 13 లక్షలకు విక్రయిస్తామని నిందితులు మదనపల్లెకు చెందిన పొన్నంరెడ్డి శోభారాణి, ఆమె భర్త పుల్లారెడ్డిలను నమ్మించారు.

ముందస్తు పథకం ప్రకారం బాధిత దంపతులను పొలం వద్దకు తీసుకెళ్లి కొలతలు వేయించి, 01-09-2025న రూ. 13 లక్షలు నగదుగా తీసుకున్నారు. అనంతరం అగ్రిమెంట్ రాసిచ్చి, తరువాత పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని చెప్పి మరో రూ. 1,00,000/- తీసుకున్నారు. ఆ తర్వాత తహసీల్దార్ సంతకం ఉన్నట్లుగా నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి బాధితులకు ఇచ్చారు.

తరువాత బాధితులు తమకు ఇచ్చిన పాస్ పుస్తకాలు నకిలీవని, సంబంధిత భూమిని అప్పటికే ఇతరులకు విక్రయించారని తెలుసుకున్నారు. దీంతో నిందితులను నిలదీస్తే, వారు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ప్రాణహాని కలిగిస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో బాధితురాలు పొన్నంరెడ్డి శోభారాణి జూలై 29, 2026న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా FIR No.220/2026గా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఇది స్పష్టమైన మోసం, నకిలీ పత్రాల సృష్టి (ఫోర్జరీ) కేసు అని నిర్ధారణ కావడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ యం. బుచ్చిరాజు పర్యవేక్షణలో తాలూకా సీఐ కళా వెంకటరమణ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని ఆగస్టు 1, 2026న మధ్యాహ్నం 1 గంట సమయంలో నిమ్మనపల్లె నాలుగు రోడ్ల కూడలి (కదిరి – మదనపల్లె మెయిన్ రోడ్డు) వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇందులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.