రాయలసీమ న్యూస్, అన్నమయ్య: మదనపల్లె:- ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అలాంటి రక్తాన్ని ఎలాంటి ఔషధ సంస్థలు, వైద్య సాంకేతికత తయారు చేయలేవు. రక్తదాతలు ముందుకు వచ్చి దానం చేస్తే తప్ప ఆ ప్రాణాలు నిలవవు. ప్రమాదాల్లో గాయపడిన వారు, ప్రసవానికి ఆసుపత్రులకు వచ్చే మహిళలు, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు సకాలంలో రక్తం అందకపోతే పరిస్థితి విషమిస్తుంది. సమయానికి రక్తం ఎక్కిస్తేనే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ నేపథ్యంలో రక్తదాతలను ప్రాణదాతలతో సమానంగా భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు యువకులు రక్తదాన ఉద్యమాన్ని చేపట్టి, తరచూ రక్తదానం చేస్తూ అనేక మందికి కొత్త జీవం పోస్తున్నారు. తమ సేవలతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆ యువ రక్తదాతల సేవలను గుర్తుచేసుకుంటూ ప్రత్యేక కథనం.
మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సంస్థ నిర్వాహకుడు అబుబకర్ సిద్దిక్ 15 ఏళ్లుగా నిరంతర రక్తదానంలో కొనసాగుతున్నారు. సకాలంలో రక్తం అందక ఎవ్వరూ మృత్యువాత పడకూడదనే సంకల్పంతో ఈ సేవ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
పీలేరు ప్రాంతానికి చెందిన జనతా సహారా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు ఆరీఫ్ కూడా రక్తదానాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకున్న యువకుల్లో ఒకరు. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా ప్రసవానికి వచ్చే మహిళలకు రక్తం అందించాలన్న ఉద్దేశంతో సంస్థను ప్రారంభించినట్లు ఆయన వివరించారు.
అంగళ్లు ప్రాంతానికి చెందిన వెల్‌విషర్స్ సభ్యుడు, ఏబీ పాజిటివ్ రక్తదాత మధు కూడా తరచూ రక్తదానం చేస్తూ సేవలందిస్తున్నారు. ప్రమాదాల్లో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని చూసిన అనుభవం తనను రక్తదాతగా మార్చిందని ఆయన చెబుతున్నారు.
ఇలా జిల్లాలోని పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాన్ని అలవాటుగా మార్చుకోవడం, సంస్థల రూపంలో ఏర్పడి మరింత మందిని ఈ సేవలో భాగస్వాములను చేయడం ప్రశంసనీయంగా మారింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వీరి సేవలు మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి.













