రాయలసీమ న్యూస్, అన్నమయ్య: సమాజంలో పీడిత వర్గాలపై కొనసాగుతున్న వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణాను సమూలంగా నిర్మూలించేందుకు అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఈ అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
‘వెట్టి చాకిరీ (నిర్మూలన) చట్టం - 1976’ మరియు ‘కార్మికుల అక్రమ రవాణా వంటి కీలక చట్టపరమైన అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది. కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి అధ్యక్షత వహించారు.
సదస్సులో మాట్లాడిన అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని అమాయకులను బలవంతంగా వెట్టిచాకిరీకి గురిచేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మానవ అక్రమ రవాణా ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బాధితులను గుర్తించి రక్షించడంతో పాటు నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా ప్రతి కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పీడిత వర్గాలపై జరిగే దోపిడీ, బలవంతపు శ్రమను గుర్తించడంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సదస్సులో ప్రత్యేకంగా పాల్గొన్న ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్(IJM) ప్రతినిధులు రాష్ట్రంలో కార్మికుల అక్రమ రవాణా ఎలా జరుగుతోంది, క్షేత్ర స్థాయిలో బాధితులను ఎలా గుర్తించాలి వంటి అంశాలను వివరించారు. పోలీసు శాఖతో సమన్వయం ద్వారా వెట్టిచాకిరీ బాధితులను రక్షించడం, వారికి ఉచిత న్యాయసాయం అందించడం, ప్రభుత్వ పథకాల ద్వారా పునరావాసం కల్పించడం వంటి చర్యల్లో IJM నిరంతరం భాగస్వామ్యం అవుతోందని తెలిపారు.
చట్టవిరుద్ధంగా కార్మికులను తరలించే బ్రోకర్ల వ్యవస్థను ఛేదించడంలో దర్యాప్తు అధికారులకు అవసరమైన మెలకువలు, పద్ధతులను IJM ప్రతినిధులు వివరించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ, ఆధారాల సురక్షిత పరిరక్షణ, కేసుల న్యాయపరమైన పోరాటంలో అనుసరించాల్సిన విధానాలపై వారికి మార్గనిర్దేశం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణా కేసులను గుర్తించడం, నమోదు చేయడం, దర్యాప్తు చేయడంలో ఈ సదస్సు ద్వారా పోలీసు సిబ్బందికి ఉపయోగకరమైన మార్గదర్శకాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు.













