రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతతో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
2024–29 సస్టెయినబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోలుపై ఎక్స్‌షోరూమ్ ధరలో 5 శాతం వరకు రాయితీ కల్పించినట్లు తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకునే విద్యుత్ వాహనాలకు ఐదేళ్లపాటు రోడ్ ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఈవీల వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొన్నారు. దీంతో సాధారణ వినియోగదారులు, వాణిజ్య రవాణా రంగం రెండింటికీ విద్యుత్ వాహనాల కొనుగోలు ఆర్థికంగా మరింత అనుకూలంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ చర్యలతో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి, విద్యుత్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను మంత్రి ప్రస్తావించారు. ఆగస్టులో దేశవ్యాప్తంగా సుమారు 2.98 లక్షల విద్యుత్ వాహనాలు విక్రయించబడటం, గత ఏడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి నమోదవడం ఈ రంగానికి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆయన అన్నారు. మొత్తం వాహన మార్కెట్‌లో విద్యుత్ వాహనాల వాటా 9.5 శాతం నుంచి 12.3 శాతానికి పెరగడం భవిష్యత్ రవాణా వ్యవస్థలో విద్యుత్ వాహనాల ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.













