హిందీ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ తన నటనా ప్రయాణం, మానసిక ఒత్తిడులు, భవిష్యత్‌ లక్ష్యాల గురించి ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా మాట్లాడారు. గత పదేళ్లుగా నటనను మానేయాలనే ఆలోచన తరచూ వచ్చినప్పటికీ, అదే సమయంలో తనకు కొత్త పాత్రలు దొరుకుతున్నాయని ఆయన తెలిపారు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాస్సేపూర్‌’, ‘ఇన్‌స్పెక్టర్‌ జెండే’, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌, ఇప్పుడు ‘గవర్నర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.

తనపై పడుతున్న పాత్రల ప్రభావం గురించి మనోజ్‌ వివరించారు. సంవత్సరాల తరబడి సీరియస్‌, మానసికంగా అలసిపోయే పాత్రలు చేస్తే, వ్యక్తిత్వం చిరాకుగా మారిపోతుందని, మూడ్‌ స్వింగ్స్‌ పెరుగుతాయని ఆయన చెప్పారు. ఇదే కారణంగా నటనను వదిలేయాలని అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. అయితే జీవనోపాధి కోసం, కుటుంబ బాధ్యతల కోసం కాకుండా, ఆనందం, సంతృప్తి ఇచ్చే పాత్రల కోసం మాత్రమే నటించాలని తాను నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు చేసిన గంభీరమైన పాత్రలు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని మనోజ్‌ చెప్పారు. అలాంటి పాత్రల్లో పూర్తిగా లీనమైపోవడం వల్ల మానసిక, శారీరకంగా అలసిపోయేవాడినని తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని, ఇకపై తేలికపాటి, కమర్షియల్‌ సినిమాలు చేయాలని ఆశపడుతున్నట్టు వెల్లడించారు.

సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న వ్యక్తిగత నష్టాలను కూడా మనోజ్‌ ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచే చదువు, కెరీర్‌ కోసం గ్రామం నుంచి దూరంగా బోర్డింగ్‌ పాఠశాల, తర్వాత దిల్లీ, ముంబయిల్లో గడపాల్సి రావడంతో తల్లిదండ్రులతో గడిపే సమయం తగ్గిపోయిందని చెప్పారు. ఈ లోటు ఇప్పటికీ తనను వేధిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కెరీర్‌ ప్రారంభ దశలో ఎదుర్కొన్న తిరస్కరణలు, ఆర్థిక ఇబ్బందులను మనోజ్‌ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన ప్రతిభపై తానే సందేహపడే స్థితి వచ్చిందని చెప్పారు. అనారోగ్య సమస్యల మధ్య సెట్లకు వెళ్లి, అక్కడ నుంచి తిట్టిపోసి పంపించిన రోజులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. సినీ కుటుంబానికి చెందకపోయినా, పోరాటం, పట్టుదలతోనే ఈ స్థాయికి చేరుకున్నానని మనోజ్‌ బాజ్‌పేయీ తెలిపారు.