బాలీవుడ్‌ నటుడు రణవీర్‌ సింగ్‌పై ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌’ (FWICE) విధించిన నాన్‌ కో-ఆపరేషన్‌ నిషేధాన్ని ఉపసంహరించుకున్నట్లు ఫెడరేషన్‌ బుధవారం ప్రకటించింది. ‘డాన్ 3’ ప్రాజెక్ట్‌ నుంచి రణవీర్ తప్పుకోవడంతో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

రణవీర్‌ సింగ్‌కు ఊరట కలిగించేలా FWICE తాజా నిర్ణయం తీసుకుంది. రణవీర్ పంపిన లీగల్‌ నోటీసుల అనంతరం, ఆయనపై అమల్లో ఉన్న నాన్‌ కో-ఆపరేషన్‌ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు FWICE అధ్యక్షుడు బీఎన్‌ తివారీ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ముంబైలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించి వివరాలు వెల్లడించారు.

తివారీ ప్రకారం, రణవీర్‌ సింగ్‌ మరియు ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మధ్య నెలకొన్న సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. ఈ వివాదంపై ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బృందంతో చర్చలు జరిపి, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని రణవీర్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.

ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో రణవీర్‌ సింగ్‌ హీరోగా ‘డాన్‌ 3’ సినిమాను ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. అయితే షూటింగ్‌ ప్రారంభానికి ముందే రణవీర్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగాడు. ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన నేపథ్యంలో, రణవీర్‌ తప్పుకోవడం వల్ల సుమారు రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నిర్మాతల వర్గాలు ఆరోపించాయి.

ఈ అంశంపై చర్చించేందుకు రణవీర్‌ సహకరించడం లేదని, నిర్మాతల సంస్థతో ఉన్న వివాదం పరిష్కారం కానంతవరకూ ఆయనతో కలిసి పని చేయవద్దని సినీ కార్మికులకు సూచిస్తూ FWICE ముందుగా నాన్‌ కో-ఆపరేషన్‌ ప్రకటన జారీ చేసింది. దీనికి ప్రతిస్పందనగా రణవీర్‌ సింగ్‌ మంగళవారం FWICE కు లీగల్‌ నోటీసులు పంపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే ఫెడరేషన్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రణవీర్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తూ, ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి సూచించింది.

FWICE చీఫ్‌ అడ్వైజర్‌ అశోక్‌ పండిట్‌ కూడా ఈ అంశంపై స్పందించారు. ఇండస్ట్రీలో ఎవరిపైనా బ్యాన్‌ విధించే హక్కు తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. రణవీర్‌ సింగ్‌ నుంచి ఈ విషయంపై సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే, మేకర్స్‌తో చర్చలు జరిపి వివాదాన్ని ముగించుకునే దిశగా ముందుకు సాగాలని తాము సూచించినట్టు పేర్కొన్నారు.