కొత్త జానర్‌లోకి అడుగుపెట్టనున్న కీర్తి సురేశ్‌

కొత్తదనం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్‌... వివాహం తర్వాత సినిమాల జోరును మరింతగా పెంచింది. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను అంగీకరిస్తూ బిజీగా మారింది.

ప్రస్తుతం కీర్తి సురేశ్‌ ‘కన్నెవెడి’, ‘తోట్టం’, ‘రౌడీ జనార్ధన’, ‘రఫ్తార్‌’ వంటి వైవిధ్యమైన చిత్రాల షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతోంది. వేర్వేరు భాషల్లో, భిన్నమైన కథాంశాలతో రూపొందుతున్న ఈ సినిమాల్లో ఆమె విభిన్న పాత్రల్లో కనిపించనుంది.

ఇదిలా ఉండగా, కీర్తి మరో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆమె ఒక భారీ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఓ ప్రముఖ హిందీ దర్శకుడుతో ఆమె చర్చలు జరుపుతోందని టాక్‌.

బాలీవుడ్‌ వర్గాల ప్రకారం, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు ఈ భారీ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ద్వారా కొత్త జానర్‌ను ప్రయత్నించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రం ఆమె సినీ ప్రయాణంలో మరో ముందడుగు అవుతుందని భావిస్తున్నారు. కీర్తి ఇప్పటివరకు నటించని తరహా కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముందని సమాచారం.

కీర్తి సురేశ్‌ హిందీ చిత్రసీమలోకి ‘బేబీ జాన్‌’ చిత్రంతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె అక్కడ చేస్తున్న రెండో హిందీ చిత్రం ‘రఫ్తార్‌’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం భావిస్తోంది.

సౌత్‌ చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ కీర్తి సురేశ్‌ తన కెరీర్‌ను బిజీగా కొనసాగిస్తోంది. కొత్త రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ప్రాజెక్ట్‌ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.