రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సినిమా బడ్జెట్ అనేది కథకు అనుగుణంగా ఉండాలి తప్ప, అందులో ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే అంశంపై ఆధారపడకూడదని బాలీవుడ్ నటి కృతి సనన్ అభిప్రాయపడింది. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, హిందీ చిత్రసీమలో దాదాపు దశాబ్దం పూర్తి చేసిన ఈ నాయిక ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నాతో కలిసి నటించిన ‘కాక్‌టెయిల్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో తన కెరీర్ ప్రారంభ దశ అనుభవాలు, మహిళా పాత్రల స్థితిగతులు, ‘మిమీ’ సినిమా సమయంలో అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరచుకున్న నిర్ణయం గురించి కృతి వివరించింది.
‘‘నిజానికి ‘కాక్‌టెయిల్ 2’లో భాగమవ్వడానికి కంగారు పడ్డాను. ఎందుకంటే నేను ఇందులో పోషించిన అల్లీ పాత్ర జీవితం భిన్నమైనది. ఎవరినీ విమర్శించదు. సమాజానికి, బంధాలకు కట్టుబడి ఉండదు. ఆమె దృష్టిలో ప్రతిదీ తాత్కాలికమే. కానీ నేను ఆమెకు పూర్తి వ్యతిరేకం. నేను స్వతహాగా ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తా. ఈ పాత్ర పోషించడానికి నేను దర్శకుడు హోమీని స్ఫూర్తిగా తీసుకున్నా. ఆయనిది పూర్తిగా అల్లీ వ్యక్తిత్వం కాకపోయినా.. ఆమెలా కూల్‌గా ఉంటారు’’.
హిందీ చిత్రసీమలో మహిళా పాత్రల పరిణామంపై కూడా కృతి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మాధురీ దీక్షిత్, శ్రీదేవి, మీనా కుమారి వంటి నటీమణుల కాలంలో మహిళలకు బలమైన పాత్రలు లభించేవని, వారు సినిమాలకు నాయకత్వం వహించేవారని ఆమె గుర్తుచేసుకుంది. అనంతరం కొన్ని దశాబ్దాల పాటు నటీమణులకు పెద్దగా అవకాశాలు లేక, ప్రధానంగా ప్రేమ పాత్రలకే పరిమితమయ్యారని పేర్కొంది.
‘‘ప్రస్తుతం హిందీ చిత్రసీమలో పరిస్థితులు మారుతున్నాయి. కానీ చాలా నెమ్మదిగా. ఇప్పుడు మళ్లీ అమ్మాయిల కోసం బలమైన పాత్రలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. హీరోలు నాయకత్వం వహిస్తున్న చిత్రాలే ఇప్పటికీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఒక సినిమాను స్త్రీ ప్రధాన చిత్రం అని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేని రోజు రావాలని నేను కోరుకుంటున్నా. కథానాయకులు నటిస్తున్న చిత్రానికి ఎంత బడ్జెట్ ఉంటుందో.. మహిళా ప్రాధాన్య కథలకు కూడా అంతే ఉండాలి. అప్పుడే మనం నిజమైన సమానత్వాన్ని సాధించగలుగుతాం’’.
తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడుతూ, ఇతర రంగాలతో పోలిస్తే బాలీవుడ్‌లోనే ఎక్కువ కష్టాలు ఎదురైనట్టు కృతి తెలిపింది. ఇంజినీరింగ్ కాలేజీ, మోడలింగ్ రంగాల్లోకన్నా సినిమా సెట్లలోనే మహిళా నటులను తేలికగా తీసుకునే ధోరణి ఎక్కువగా కనిపించిందని ఆమె వ్యాఖ్యానించింది.
‘‘సినిమా సెట్‌లో నటీనటులు తమ పాత్రల గురించి దర్శకులను, సాంకేతిక నిపుణులను ప్రశ్నలు అడగడం సహజం. కానీ ఒక హీరోయిన్ ప్రశ్నలు అడిగితే ‘ఈమె ఏంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతోంది’ అని వెనకాల మాట్లాడుకుంటారు. అదే ఒక హీరో అడిగితే మాత్రం సినిమాపై అతనికి చాలా శ్రద్ధ ఉందని, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడని మెచ్చుకుంటారు. నాకూ ఇలానే జరిగింది. దీంతో పాటు సినిమా సెట్స్‌లో క్యారవాన్లు, రూములు, కార్ల కేటాయింపుల్లోనూ వ్యత్యాసాలు చూపిస్తారు. హీరోలకు లగ్జరీ వసతులు కల్పించి, నాకు చిన్న గది, కారు కేటాయించినా నేను బాధపడను. కానీ దాని వల్ల నన్ను తక్కువగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. నన్ను తక్కువ చేసి చూడొద్దు’’.
తన వ్యక్తిగత నిర్ణయాల గురించి కూడా కృతి ఓపెన్‌గా మాట్లాడింది. ‘మిమీ’ చిత్రంలో పాత్ర కోసం బరువు పెరగాల్సి వచ్చిన సమయంలోనే అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరచుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆమె వెల్లడించింది.
‘‘నేను నా అండాలను ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరుచుకున్నాను. ఈ విషయాన్ని మొదటిసారి పంచుకుంటున్నా. ‘మిమీ’ కోసం బరువు పెరగాల్సి వచ్చిన సమయంలో నేను ఈ పని చేశాను. ఈ సినిమాలోని పాత్ర కోసం నేను బరువు పెరగాల్సిన విషయం గురించి నా సన్నిహితులతో చర్చించినప్పుడు ఈ అండాల ఫ్రీజింగ్ సలహా ఇచ్చారు. ‘నీకు వీలైతే నీకోసం నువ్వు చేసుకోగలిగే ఉత్తమమైన పని ఇదే. నీకు నువ్వే ఇచ్చుకోగలిగే అత్యుత్తమ బహుమతి ఇదే’ అని సలహా ఇచ్చారు. ఆ మాట నా మనసులో మెదులుతూనే ఉంది. ఆ తర్వాత బరువు పెరగమని చెప్పినప్పుడు రెండు నెలలు షూటింగ్ లేదు. అండాలను భద్రపరచుకోవడానికి అదే సరైన సమయం అని భావించాను. ఒక నిర్దిష్ట వయసు తర్వాత మహిళల శరీరాలు మారిపోతాయి. దానివల్ల ఆరోగ్యకరమైన పద్ధతిలో గర్భం దాల్చడం కష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇది సహజంగానే అనిపించింది’’ అని కృతి సనన్ తెలిపింది.






