జీవితకాలపు కష్టాన్ని కూడబెట్టి, పైసా పైసా పోగుచేసి సామాన్యుడు కొనుక్కున్న సెంటు భూమికి ఒక తెల్లవారుజామున '22A' అనే ఉరితాడు పడితే... ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు మెట్లు ఎక్కిన ఆశజీవికి 'మీ భూమి 22A లో ఉంది, రిజిస్ట్రేషన్ కుదరదు' అనే మాట చెవిన పడగానే, గుండె ఆగినంత పనవుతుంది. కొన్నది భూమా? లేక పీకల మీదకు తెచ్చుకున్న గుదిబండా? అనే ప్రశ్న వేధించడం మొదలవుతుంది. అసలు రిజిస్ట్రేషన్ల చట్టం, 1908 లోని సెక్షన్ 22A ప్రభుత్వ భూములను, వక్ఫ్, దేవాదాయ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన కవచం. కానీ, ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సెక్షన్ సామాన్యుల పాలిట శాపంగా, రియల్ ఎస్టేట్ రాబందుల చేతిలో ఆయుధంగా ఎలా మారిందో చూస్తే విస్తుపోక తప్పదు. వ్యవస్థను అడ్డుపెట్టుకుని గత ఐదేళ్లలో సాగిన 'ఫ్రీహోల్డ్' మాయాజాలం, దాన్ని సరిదిద్దే నెపంతో ప్రస్తుత పాలకులు చేస్తున్న జాప్యం... వెరసి సామాన్య ప్రజలు ఆస్తులున్నా అనాథలుగా మిగిలిపోతున్న దుస్థితికి నిలువెత్తు సాక్ష్యం ఈ 22A వివాదం.

ఫ్రీహోల్డ్ ముసుగులో భూతపర్వం

'ఫ్రీహోల్డ్'... పేరు వినడానికి ఎంత బాగుందో, ఈ ముసుగులో జరిగిన స్కామ్ అంతకంటే భయానకం. ఇరవై ఏళ్లుగా సాగులో ఉన్న అసైన్డ్ భూములకు, పేదవాడికి యాజమాన్య హక్కులు కల్పిస్తామంటూ గత ప్రభుత్వం ఒక బృహత్తర నాటకానికి తెరతీసింది. సుమారు 13.6 లక్షల ఎకరాలను 22A జాబితా నుంచి రాత్రికి రాత్రే తొలగించింది. పైకి చూస్తే పేదల మీద ఎక్కడలేని ప్రేమ ఉప్పొంగినట్లు కనిపిస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. పేదవాడికి దక్కింది పట్టా కాగితమైతే, పెద్దల నోట్లోకి వెళ్ళింది లక్షల కోట్ల విలువైన భూమి. నిబంధనలకు నీళ్లు వదిలి, సుమారు 5.7 లక్షల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల, అప్పటి అధికార పార్టీ పెద్దల పరమయ్యాయనేది నగ్న సత్యం.

పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను ముందుగానే బినామీ పేర్లతో, కారుచౌకగా అగ్రిమెంట్లు రాయించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు జీవోలు తీసుకురావడం, అప్పటికే పెద్దల గుప్పిట్లోకి వెళ్లిన భూములకు ఫ్రీహోల్డ్ పేరుతో పవిత్రత ఆపాదించడం చకచకా జరిగిపోయాయి. చట్టం ముసుగులో జరిగిన ఈ వ్యవహారం, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్యాక్రాంతం కాకూడదన్న ఉద్దేశ్యంతో దశాబ్దాల క్రితం ఇచ్చిన అసైన్డ్ భూములు, రాత్రికి రాత్రే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. కంచే చేను మేసిన చందంగా, కాపాడాల్సిన చట్టమే దోపిడీకి రాజమార్గం వేసింది.

పాలకుల మీనమేషాలు... ప్రజల పాట్లు

కాలం మారింది. అధికారం చేతులు మారింది. 2024 ఆగస్టులో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం, ఈ ఫ్రీహోల్డ్ అక్రమాలకు కళ్లెం వేసే దిశగా మొదటి అడుగు వేసింది. ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేసింది. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో తేల్చేందుకు మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. ఉద్దేశ్యం మంచిదే కావచ్చు. కానీ, ఆపడం సులువే... దాన్ని పరిష్కరించడమే పాలకులకు అసలు పరీక్ష. అప్పటి నుండి నేటి వరకూ ఆ లక్షలాది ఎకరాల భూములపై రిజిస్ట్రేషన్ ఫ్రీజ్ కొనసాగుతూనే ఉంది. ఈ మీనమేషాల వల్ల అసలు నష్టపోతున్నది ఎవరు? తప్పు చేసిన రాజకీయ నాయకులు, అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా తమ పనులు చేసుకుంటున్నారు. కానీ, ఏ పాపమెరుగని సామాన్య రైతులు, నిజాయితీగా ప్లాట్లు కొనుక్కున్న కొనుగోలుదారులు అగమ్యగోచరంలో పడ్డారు.

బిడ్డ పెళ్లి కోసమో, ప్రాణాంతక జబ్బు వైద్యం కోసమో తన సొంత భూమిని అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేదు. బ్యాంకుల దగ్గరకు వెళ్లి రుణం అడిగితే, భూమి 22A నిషేధిత జాబితాలో ఉందని అధికారులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. ఒకపక్క తప్పు చేసిన వారిపై తీసుకున్న కఠిన చర్యలు శూన్యం... మరోపక్క తమ ఆస్తిపై తమకే హక్కులు లేకుండా నిస్సహాయంగా మిగిలిపోయిన బాధితుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తప్పుల సవరణ పేరుతో నిర్ణయాలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం, ప్రజల పాలిట కఠిన శిక్షగా మారుతోంది.

పై స్థాయిలో పాలసీ... కింది స్థాయిలో పైరవీ

ఇక వ్యవస్థాగత లోపాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పై స్థాయిలో పాలసీలు ఎంత పారదర్శకంగా ఉన్నా... కింది స్థాయిలో రెవెన్యూ అధికారుల చేతివాటం ముందు అవన్నీ దిగదుడుపే. వెబ్‌ల్యాండ్ (Webland) ఆన్‌లైన్ ఎంట్రీలలో జరిగిన తప్పులు, చుక్కల భూముల పేరుతో సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. తరతరాలుగా అనుభవిస్తున్న ప్రైవేటు పట్టా భూములు సైతం రాత్రికి రాత్రే పొరపాటున 22A లో పడిపోయాయి. ఆ పొరపాటును సరిచేయించుకుని, భూమిని 22A నుంచి విముక్తి చేయడానికి ఒక సామాన్యుడు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ప్రదక్షిణలు అన్నీ ఇన్నీ కావు. ఫైలు ఒక బల్ల మీద నుంచి మరో బల్ల మీదకు కదలాలంటే పైసలు రాలాల్సిందే. వీఆర్వో నుంచి మొదలుపెడితే తహసీల్దార్, ఆర్డీవో వరకూ... ప్రతి స్థాయిలోనూ సామాన్యుడి రక్తం పీల్చుకుతింటున్నారు.

కొత్త ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో, కలెక్టర్ల అధికారాలను జేసీలు, ఆర్డీవోలకు బదిలీ చేస్తూ, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులు తదితర ఐదు కేటగిరీలకు చెందిన 1.6 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించడం కాస్త ఊరటనిచ్చే అంశమే. కానీ, క్షేత్ర స్థాయిలో ఆ ఉత్తర్వులు అమలు కావడానికి, ఫైళ్లు కదలడానికి ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో పాలకులకు తెలుసా? వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా, కేవలం జీవోలు జారీ చేస్తే సరిపోదు. చట్టంలోని లొసుగులను వాడుకుని రైతులను పీడించే రెవెన్యూ వ్యవస్థలోని ఈ అవినీతిపరులను ఏరిపారేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఆచరణలో జోరు ఏదీ?

రాజకీయ విచారణల పేరుతో పాలన స్తంభించిపోకూడదు. తప్పు చేసిన వాడిని చట్టం ముందు నిలబెట్టాలి, అంతేగానీ ఆ నెపంతో సామాన్యుడి ఆస్తి హక్కులను అగౌరవపరచడం ఏ ప్రభుత్వానికీ తగదు. ప్రభుత్వం రీ-సర్వే 2.0 పేరిట టెక్నాలజీని వాడుకుంటూ, బ్లాక్ చెయిన్ వంటి అత్యాధునిక విధానాలతో భూ రికార్డులను భద్రపరచాలని ఆలోచించడం భవిష్యత్తుకి ఖచ్చితంగా భరోసా ఇచ్చే పరిణామమే. కానీ, వర్తమానంలో తమ ఆస్తుల మీద హక్కుల్లేక అల్లాడిపోతున్న లక్షలాది మంది బాధితులకు కావాల్సింది ఈ సాంకేతిక కబుర్లు కాదు.

మంత్రుల బృందం (GoM) నివేదికలు ఎప్పుడు వెలుగుచూస్తాయి? నిజమైన లబ్ధిదారులను, అక్రమార్కులను వేరుచేసే స్పష్టమైన యంత్రాంగం ఏది? ప్రజలు కోరుకునేది నివేదికల నిరీక్షణ కాదు... నికార్సయిన పరిష్కారం. 22A అనేది భూ ఆక్రమణదారుల పాలిట ఉచ్చులా మారాలి కానీ, పన్నులు కట్టే సామాన్యుడి మెడకు ఉరితాడు కాకూడదు. ప్రభుత్వం జాప్యం వీడి, జవాబుదారీతనంతో అడుగులు వేయాల్సిన సమయమిదే! పాలకుల పెన్ను నుంచి జాలువారే సంతకం, ప్రజల కన్నీళ్లు తుడవాలి తప్ప కంటిమీద కునుకు లేకుండా చేయకూడదు. ఆచరణలో జోరు చూపించకపోతే, పాలనంటే కేవలం ఫైళ్లలో పాతరెయ్యడమే అనే అపప్రద మూటగట్టుకోక తప్పదు.

జి. శ్రీనివాస రెడ్డి

రాయలసీమ న్యూస్