రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా తమ మొబైల్ వినియోగదారులకు ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటనలు లేకుండానే పెద్ద షాక్ ఇచ్చింది. అత్యంత ప్రాచుర్యం పొందిన పలు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రిపెయిడ్ ప్లాన్లను కంపెనీ నిశ్శబ్దంగా నిలిపివేసింది. ఎయిర్టెల్ Official వెబ్ సైట్ , ఎయిర్టెల్ థాంక్స్ అప్ నుండి ఈ ప్లాన్లను తొలగించారు.
వినియోగదారులు ఎక్కువగా రీఛార్జ్ చేసుకునే ₹299, ₹319, ₹579, ₹619, ₹649, ₹799 ప్రిపెయిడ్ ప్లాన్లు ఇక అందుబాటులో లేవు. ఈ ప్లాన్లను ఎయిర్‌టెల్ పూర్తిగా రద్దు చేసినట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా నెలవారీ ప్రాతిపదికన రోజుకు 1.5GB డేటాను అందించే ₹299 ప్లాన్ నిలిపివేయడం సామాన్య వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని టెలికాం రంగ పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా అందించే ప్లాన్లలో ₹299, ₹319 వంటి ప్యాకేజీలు వినియోగదారులకు ప్రధాన ఎంపికగా ఉండేవి. ఇవి తొలగించడంతో, అదే తరహా సేవలు కోరుకునే వారికి ఇప్పుడు ₹349 ప్లాన్ కనీస అన్‌లిమిటెడ్ ఆప్షన్‌గా మారింది.
ప్రస్తుతం ఎయిర్టెల్ ప్రిపెయిడ్ విభాగంలో ప్రతిరోజూ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందించే ప్లాన్లలో ₹349 ప్లాన్ అత్యంత చౌకైన ప్రాథమిక ఎంపికగా ఉంది. దీంతో నెలవారీ కనీస రీఛార్జ్ ఖర్చు దాదాపు 17 శాతం వరకు పెరిగినట్లయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టెలికాం రంగంలో ప్రత్యక్షంగా టారిఫ్ పెంపు ప్రకటించకుండా, పరోక్షంగా ధరలను పెంచే వ్యూహంలో భాగంగానే ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తక్కువ ధర ప్లాన్లను తొలగించి, వినియోగదారులను ఎక్కువ ధర ఉన్న ప్యాకేజీల వైపు మళ్లించే ప్రయత్నంగా ఈ చర్యను వారు విశ్లేషిస్తున్నారు.
ఇకపై రీఛార్జ్ చేసుకునే ముందు వినియోగదారులు తప్పనిసరిగా ఎయిర్టెల్ Official వెబ్ సైట్ లేదా ఎయిర్టెల్ థాంక్స్ అప్ ద్వారా తాజా ప్లాన్ల వివరాలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఉపయోగించిన ప్లాన్ ఇప్పుడు అందుబాటులో ఉందో లేదో ముందుగా పరిశీలించి, ఆ తర్వాతే రీఛార్జ్ నిర్ణయం తీసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.






