రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
బంగారం, వెండి ధరలు భారీగా పతనం
బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం నమోదైంది. అంతర్జాతీయ విపణిలో మేలిమి బంగారం ధర గణనీయంగా తగ్గడంతో దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం పడింది. అంటే మంగళ, బుధ, గురువారం మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.11,400కు పైగా, కిలో వెండి ధర సుమారు రూ.9,500 మేర తగ్గినట్టైంది.
హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.1,50,400కు పడిపోయింది. కిలో వెండి ధర కూడా రూ.2,42,000కు దిగజారింది. గురువారం కూడా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 2,130 రూపాయలు.. 22 క్యారెట్లపై 1,950 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం గురువారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,45,640 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,33,500 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,09,230 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక, ఈ రోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా కొనసాగుతున్నాయి.
మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,900గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,51,480గా నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,45,640 రూపాయల కొనసాగుతోంది. అంటే మంగళ, బుధ, గురువారం మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.11,400కు పైగా, కిలో వెండి ధర సుమారు రూ.9,500 మేర తగ్గినట్టైంది. ఈ ఆకస్మిక పతనంతో ఆభరణాల వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) మేలిమి బంగారం ధర 150 డాలర్లు తగ్గి 4,110 డాలర్లకు చేరింది. మార్చిలో ఔన్సు బంగారం ధర 5,400 డాలర్ల స్థాయిలో ఉండగా, ఇప్పటివరకు దాదాపు 1,400 డాలర్ల మేర క్షీణించింది. ముడిచమురు ధర మళ్లీ పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అధిక ద్రవ్యోల్బణం మధ్య ఉద్యోగ నియామకాలు అంచనాలకు మించి ఉండటం వంటి అంశాలు బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
అమెరికాలో వడ్డీరేట్లు త్వరలో తగ్గవనే అంచనాలు తగ్గిపోవడంతో, బంగారం ఆకర్షణ కొంత మేర తగ్గినట్లు విశ్లేషకులు సూచిస్తున్నారు. డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలు వినియోగించే దేశాల వారికి బంగారం కొనుగోలు మరింత ఖరీదుగా మారుతుంది. అదే సమయంలో ముడిచమురు ధరలు పెరిగినప్పుడు పసిడిపై పెట్టుబడులు తగ్గే ధోరణి కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సమీప కాలంలో కూడా బంగారం, వెండి ధరలు మరికొంత మేర సవరణకు లోనయ్యే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశీయంగా బంగారం, వెండి కోసం అంతర్జాతీయ సరఫరాలపైనే భారత్ అధికంగా ఆధారపడుతోంది. విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు ఈ లోహాల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎత్తులోనే ఉన్నాయి. డాలర్ విలువ రూ.95.25 వద్ద ఉండటం కూడా దిగుమతి ఖర్చును పెంచుతోంది.
అధిక పన్నుల కారణంగా స్మగులింగ్ ద్వారా దేశంలోకి వచ్చే, అధికారిక లెక్కల్లో నమోదు కాని బంగారం (గ్రే మార్కెట్) అమ్మకాలు పెరిగినట్లు ఆభరణాల వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకులు దిగుమతి చేసుకుని బిల్లుపై విక్రయించే బంగారం ధరలతో పోలిస్తే, బిల్లు లేకుండా జరిగే సెకండ్స్ మార్కెట్ ధరల మధ్య గ్రాముకు సుమారు రూ.1,200 వరకు తేడా ఉండటం వల్ల ఆభరణాల దుకాణాల్లో చట్టబద్ధ విక్రయాలు నెమ్మదించినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.







