రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
ఓటమి భయమేసింది: విజయంపై తన ఆలోచనలు పంచుకున్న రాధికా మర్చంట్
మర్చంట్‌ల యువరాణిగా, అంబానీల కోడలిగా పేరు తెచ్చుకున్న రాధికా మర్చంట్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఇండియా ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ నిర్వహించిన ఢిల్లీ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులతో ఆమె సంభాషించారు. ఈ సందర్భంగా విజయంపై, ఫెమినిజం, ఆర్థిక స్వాతంత్య్రం వంటి అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు.
తన ఇరవై ఏళ్ల వయసులో ఓటమి భయం తీవ్రంగా వేధించేదని రాధికా వెల్లడించారు. పెద్దయ్యాక బాధ్యతలు పెరుగుతాయని, వాటిని గురించి పదేపదే వినడం వల్ల యువతలో ఇలాంటి భయం సహజమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆ భయాన్ని అధిగమించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఫెమినిజం గురించి మాట్లాడిన రాధికా, తన తల్లి, అత్త ఇద్దరూ బలమైన వ్యక్తిత్వం కలిగినవారని, మాతృస్వామ్య వాతావరణంలోనే తాను పెరిగినట్టు పేర్కొన్నారు. సమానత్వం కోసం కేవలం మహిళలే కృషి చేస్తే సరిపోదని, అబ్బాయిలకూ చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ ఇంట్లో భర్త అనంత్‌తో కలిసి నిర్ణయాలు తీసుకుంటామని, అన్ని విషయాల్లో సమానత్వం పాటిస్తున్నామని వివరించారు.
ఆర్థిక స్వాతంత్య్రం ప్రాముఖ్యతను రాధికా ప్రత్యేకంగా రेखాంఖితం చేశారు. కుటుంబ నేపథ్యం, జీవిత భాగస్వామి సంపద ఎలా ఉన్నా ప్రతి మహిళా తనకంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆమె సూచించారు.
నిరంతర విద్య, స్వీయ అవగాహనపై కూడా రాధికా దృష్టి సారించారు. నేర్చుకోవడం జీవితాంతం కొనసాగాల్సిన ప్రక్రియగా భావించాలని, ఇతరుల అంచనాలు, ఒత్తిడుల ఆధారంగా కాకుండా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని ఆమె యువతకు సూచించారు.
ఇండియా ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ వేదికగా రాధికా మర్చంట్ చెప్పిన ఈ సందేశాలు అక్కడి విద్యార్థులకు ప్రేరణనిచ్చాయి. విజయాన్ని తమదైన ప్రమాణాలతో నిర్వచించుకోవాలని, భయాన్ని జయించి ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.







