రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఓ వైద్యుడు ప్రవర్తించిన రీతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న వైద్యుడు, లంచం ఇవ్వలేదన్న కోపంతో శస్త్రచికిత్స చేసిన బాలిక కాలిని ఉద్దేశపూర్వకంగా మళ్లీ విరగ్గొట్టాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
ముజఫర్‌పుర్‌కు చెందిన రేష్మ అనే మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె తన 14 ఏళ్ల కుమార్తెను ఒంటరిగా పోషిస్తోంది. మానసిక స్థితి సరిగా లేని ఆ బాలికకు నెలన్నర క్రితం ప్రమాదవశాత్తు గాయం కావడంతో ఎడమ కాలి ఎముక విరిగింది. దీనితో రేష్మ ఆమెను ముజఫర్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది.
అక్కడ చికిత్స కోసం ఆసుపత్రి సిబ్బంది రూ.25వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని రేష్మ చెప్పినా సర్జరీ చేయడానికి వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించింది.
రేష్మ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ సంబంధిత ఆసుపత్రి అధికారులను ఆ బాలికకు ఉచిత చికిత్స అందించాలని ఆదేశించారు. అయితే ఆదేశాలను పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది లంచం తప్పనిసరిగా ఇవ్వాలంటూ పట్టుబట్టినట్లు రేష్మ ఆరోపించింది. చివరికి ఆమె ఎంతో కష్టపడి రూ.8వేలు సమకూర్చి చెల్లించింది.
తరువాత చతుర్వేది అనే వైద్యుడు బాలికకు శస్త్రచికిత్స చేసి ఎముకను అతికించాడు. మిగిలిన మొత్తాన్ని తరువాత ఆసుపత్రికి వచ్చినప్పుడు చెల్లించాలని అతడు గట్టిగా చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఆ డబ్బును రేష్మ ఇవ్వలేకపోయింది.
ఈ నేపథ్యంలో పరీక్షల పేరుతో బాలికను పిలిపించిన చతుర్వేది, ఆమె నడవగలుగుతుందో లేదో చూసేందుకు తనిఖీ చేస్తానంటూ కాలిని గట్టిగా మెలిపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక నొప్పితో అరుస్తున్నా పట్టించుకోకుండా కాలిని అటూ ఇటూ తిప్పుతూ ఎముకను సరిచేస్తున్నానంటూ నమ్మబలికాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇంటికి వెళ్లిన తర్వాత కూడా బాలిక నొప్పితో విలవిల్లాడుతుండడంతో రేష్మ ఆమెను మరో ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఎక్స్‌రే పరీక్షలు చేయగా, ముందుగా చేసిన సర్జరీలో అతికించిన ఎముక మళ్లీ విరిగినట్లు రిపోర్టుల్లో తేలింది. డాక్టర్ ఉద్దేశపూర్వకంగా తన కుమార్తె కాలిని విరగ్గొట్టారని రేష్మ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై రేష్మ బంధువులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. విషయం పెద్దదిగా మారడంతో ముజఫర్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంబంధిత వైద్యుడిపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, న్యాయం జరుగుతుందని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.







