ఏలూరు: పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్నానంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన నకిలీ పోలీసు అధికారి బాగోతాన్ని ఏలూరు జిల్లా పోలీసులు బహిర్గతం చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన బత్తుల శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీను (35) పదో తరగతి మాత్రమే చదివినా, గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఉద్యోగాల పేరుతో యువకులు, మహిళలను మోసం చేసిన శ్రీనివాస్‌ తనకు బంగారం వ్యాపారం కూడా ఉందని చెప్పి పరిచయాలు పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఖరీదైన హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి, తనను నిజమైన పోలీసు అధికారి అని నమ్మేలా ప్రవర్తించినట్లు దర్యాప్తులో బయటపడింది.

పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏలూరుకు చెందిన పాలిక రంగవీరబాబు నుంచి రూ.18 లక్షలు, దండపాటి గణేశ్‌ నుంచి రూ.8 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వివరించారు. మొత్తంగా రూ.26 లక్షలు తీసుకున్న అనంతరం బాధితులకు నకిలీ నియామక పత్రాలు అందించి, పోలీసు యూనిఫాంలు కూడా ఇచ్చి మరింత నమ్మకం కలిగించినట్లు వెల్లడించారు.

తరువాత నియామక పత్రాలు నకిలీవని గుర్తించిన బాధితులు ఏలూరు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు ఆధారంగా జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఏలూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని జీకే ప్యాలెస్‌ లాడ్జిలో బస చేస్తున్న బత్తుల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి రూ.5.50 లక్షల నగదు, నకిలీ నియామక పత్రాలు, పోలీసు శాఖ పేరుతో తయారు చేసిన రబ్బరు ముద్రలు, పోలీసు యూనిఫాం, వాకీటాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఉపయోగించి ఇప్పటి వరకు పలువురిని మోసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

బత్తుల శ్రీనివాస్‌పై గతంలోనూ పలు మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రాజమండ్రి, సూర్యాపేట, మఠంపల్లి, నరసరావుపేట, త్రిపురాంతకం, చిలకలూరిపేట పోలీస్‌ స్టేషన్లలో అతనిపై కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు సమాచారం.