ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న నర్సు మరణం కేసు హత్యగా తేలింది. మొదట అనుమానాస్పద మరణంగా నమోదైన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి, ప్రియుడే పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు బయటపెట్టారు. ఆత్మహత్యగా చూపించేందుకు నకిలీ సూసైడ్ నోట్ తయారు చేసి మృతదేహం వద్ద ఉంచినట్లు కూడా విచారణలో వెల్లడైంది.

పోలీసుల సమాచారం ప్రకారం, ఫఫుండాకు చెందిన 25 ఏళ్ల నేహా, మీరట్‌లోని లోహియా నగర్ ప్రాంతంలో ఉన్న ఎంసీసీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. శనివారం ఉదయం ఆమె విధులకు ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆపరేషన్ రూంలో అపస్మారక స్థితిలో పడిఉండగా సహచరులు గుర్తించారు. వెంటనే వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు ప్రకటించారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, నేహా మృతదేహం వద్ద సల్ఫర్ మాత్రలు, ఆమె అత్తమామలపై ఆరోపణలు చేస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో పేర్కొన్న విషయాలపై నేహా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అత్తమామలతో ఎలాంటి గొడవలూ లేవని, నేహా వారికి ఎప్పుడూ ఇలాంటి విషయాలు చెప్పలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్య కోణంతో పాటు హత్య కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ కాల్ రికార్డులను పోలీసులు విశ్లేషించారు. దర్యాప్తులో ఆస్పత్రి ఉద్యోగి సురేష్, నేహా గత 7-8 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్‌లో నేహా, సురేష్, మరో ఉద్యోగి ఫర్హాన్‌లతో కలిసి ఆపరేషన్ థియేటర్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయి.

పోలీసుల విచారణలో సురేష్, తనకు ఇప్పటికే పెళ్లయిందని, ఐదేళ్ల కొడుకు ఉన్నాడని నేహాకు చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ నేహా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తూనే ఉందని, ఈ కారణంగా ఆమెను హత్య చేసినట్లు సురేష్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నేహా ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పి, శక్తి కోసం సెలైన్ ఎక్కిస్తామని నేహాకు నమ్మబలికినట్లు దర్యాప్తులో బయటపడింది. ఆ సెలైన్‌లోనే విషం కలిపి ఆపరేషన్ థియేటర్‌లో ఇంజెక్ట్ చేయడం ద్వారా హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ హత్యను ఆత్మహత్యగా చూపించేందుకు సల్ఫర్ మాత్రలు, నకిలీ సూసైడ్ నోట్‌ను మృతదేహం వద్ద ఉంచినట్లు విచారణలో తేలింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు మరో ఉద్యోగి ఫర్హాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం నేహా భర్త రవి కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. భర్త మరణం తర్వాత కుటుంబం, పిల్లల్ని పోషించుకోవడానికి నేహా ఎంసీసీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో లోహియా నగర్ ప్రాంతంలో కలకలం రేగింది.