ఉత్తరాఖండ్‌లోని మసూరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన టెకీ రాధా గాయత్రి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణాధికారిని ఉత్తరాఖండ్ పోలీసు శాఖ మార్చింది. ఇప్పటివరకు దర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిని తప్పించి, కొత్త అధికారిని నియమించారు.

ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ దీపమ్ సేథ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మసూరీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవేంద్ర చౌహాన్ ప్రవర్తనపై మృతురాలి తండ్రి సుధాకర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న DGP, కేసు దర్యాప్తు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ కేసు విచారణాధికారిగా సంపూర్ణానంద్ గైరోలాకు బాధ్యతలు అప్పగించారు. మసూరీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు దర్యాప్తు ఇకపై ఆయన పర్యవేక్షణలో కొనసాగనుంది. కేసు అన్ని కోణాల్లో పారదర్శకంగా, సమగ్రంగా విచారణ జరగాలని కుటుంబ సభ్యులు కోరుతున్న నేపథ్యంలో విచారణాధికారి మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని మసూరీలో అనుమానాస్పదరీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మొదటి నుంచీ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మృతురాలి తండ్రి సుధాకర్, అల్లుడు శ్రీచరణ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ మసూరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుధాకర్ ఫిర్యాదు ఆధారంగా మసూరీ పోలీసులు శ్రీచరణ్ సోమయాజులు పై ముందుగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం కేసు విచారణలో భాగంగా హత్య కేసుగా కూడా నమోదు చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. కేసు నమోదు తర్వాత నుంచి శ్రీచరణ్ పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కేసు విచారణాధికారిని మార్చిన తాజా పరిణామంతో దర్యాప్తు దిశలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం వాసులు ఈ కేసు త్వరగా వెలుగులోకి రావాలని, నిజాలు బయటపడాలని ఆశిస్తున్నారు.