రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఈనాడు-విశాఖపట్నం, సింహాచలం-న్యూస్‌టుడే: టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్‌లోని మసూరీ పోలీస్ స్టేషన్‌లో శనివారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అల్లుడు శ్రీచరణ్ సోమయాజులుపై అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించినట్టు తెలిపారు.
సుధాకర్ ఫిర్యాదులో రాధా గాయత్రి, శ్రీచరణ్ యాత్ర వివరాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. రుషికేశ్, హరిద్వార్ యాత్ర గురించే ముందుగా తమకు చెప్పారని, టూర్ ప్లాన్‌లో మసూరీ గురించి గానీ, అక్కడ బస చేస్తున్న విషయంగానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. అలాగే జంటగా దిగిన సెల్ఫీ ఫొటో, బంగీజంప్ విషయాలపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు.
‘రుషికేశ్, హరిద్వార్ యాత్ర గురించే మాకు చెప్పారు. టూర్ ప్లాన్‌లో మసూరీ గురించి గానీ, అక్కడ బస చేస్తున్న విషయంగానీ చెప్పలేదు. 14వ తేదీ రాత్రి భార్యాభర్తలు సన్నిహితంగా దిగిన సెల్ఫీ ఫొటో ఒకటి అల్లుడు శ్రీచరణ్ ఫోన్ నుంచి వచ్చింది. ఎప్పుడూలేని విధంగా రాత్రి 1.38 గంటలకు సెల్ఫీ ఫొటో పంపడం మరింత అనుమానాలకు తావిస్తోంది. బంగీజంప్‌కు వెళ్లామని చెబుతున్నాడు గానీ ఒక్క ఫొటో కూడా వారిద్దరి ఫోన్‌లలో లేదు. పూర్తిస్థాయి విచారణ చేసి మాకు న్యాయం చేయండి’
అని సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘శ్రీచరణ్ మా కుమార్తెకు రాత్రి ఆహారంలో ఏదైనా కలిపి ఉండొచ్చని అనుమానాలున్నాయి. గాయత్రికి తక్కువ రక్తపోటు సమస్య ఉందని పోలీసుల విచారణలో శ్రీచరణ్ చెప్పాడు. వాస్తవానికి మా అమ్మాయికి అలాంటి ఆరోగ్య సమస్య లేదు’
అని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.
విజయనగరం జిల్లాకు చెందిన రాధా గాయత్రి కొద్దిరోజుల క్రితం మసూరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు మొదటి నుంచీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మసూరీ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక రాధా గాయత్రి మరణానంతర కార్యక్రమాల కోసం శ్రీచరణ్ శనివారం సింహాచలం వచ్చాడు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన, పోస్టుమార్టం నివేదిక వెలువడితేనే అసలు విషయాలు బయటపడతాయని వ్యాఖ్యానించాడు.
‘నేను, గాయత్రి ఈ నెల 13న రిషికేశ్ బయల్దేరాం. 14న గంగా నదికి వెళ్లాం. 14న రాత్రి 11.30కు మసూరీలో బస చేశాం. ఉదయం లేచి చూసేసరికి ఆమె ముక్కులోంచి రక్తం వస్తోంది. ఆ తర్వాత చనిపోయింది’
అని శ్రీచరణ్ మీడియాకు తెలిపాడు.
రాధా గాయత్రి మృతి చుట్టూ వస్తున్న ఆరోపణలు, కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో మసూరీ పోలీసుల దర్యాప్తు దిశపై ఇప్పుడు దృష్టి కేంద్రీకృతమైంది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ విశ్లేషణల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.







