రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారులను గందరగోళానికి గురి చేసి వారి ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేయడానికి కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది.
తాజాగా గుర్తించిన ఈ మోసం విధానంలో, నేరగాళ్లు ముందుగా ఒక ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నారు. అందులో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.5,000 లేదా రూ.10,000 డెబిట్ అయ్యిందని, ఒకవేళ మీరు ఈ ట్రాన్సాక్షన్ చేయకపోతే ‘NO’ అని రిప్లై ఇవ్వాలని పేర్కొంటున్నారు. అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యిందన్న భయంతో చాలామంది వెంటనే ‘NO’ అని టైప్ చేసి పంపే అవకాశం ఉంది.
నిపుణుల వివరాల ప్రకారం, వినియోగదారు ‘NO’ అని రిప్లై ఇచ్చిన వెంటనే ఆ ఫోన్ లోకి ప్రమాదకర లింక్ లేదా మాల్వేర్ యాక్టివేట్ అయ్యేలా నేరగాళ్లు సెటప్ చేసుంటారు. ఈ మాల్వేర్ ద్వారా మొబైల్ లోని బ్యాంక్ సంబంధిత వివరాలు, OTP లు, ఇతర సున్నితమైన సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉంది. ఆ తర్వాత ఆ వివరాలను ఉపయోగించి ఖాతాలోని మొత్తం డబ్బును ఖాళీ చేసే అవకాశం ఉందని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి మోసాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత నంబర్ల నుంచి వచ్చే సందేశాలపై జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ లకు సంబంధించినట్టు కనిపించే సందేశాలు వచ్చినప్పుడు, వెంటనే భయపడకుండా, ముందుగా వాటి నిజానిజాలను ధృవీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
RSN సూచనలు ప్రకారం, అపరిచిత నంబర్ నుండి వచ్చే ఇలాంటి సందేశాలకు YES / NO అని ఎట్టి పరిస్థితుల్లో రిప్లై ఇవ్వకూడదు. సందేశంలో ఉన్న ఏ లింక్ పైనా క్లిక్ చేయరాదు. మీ OTP, బ్యాంక్ పిన్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకులు, అధికారిక సంస్థలు ఈ వివరాలను వాట్సాప్ లేదా సాధారణ మెసేజ్ ద్వారా అడగవని ప్రజలు గుర్తుంచుకోవాలి.
ఇలాంటి సందేహాస్పద మెసేజ్ లు వచ్చినప్పుడు లేదా ఇప్పటికే ఏదైనా లింక్ పై క్లిక్ చేశామన్న అనుమానం వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కి కాల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా http://www.cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. సైబర్ నేరాలపై సమయానికి సమాచారం ఇవ్వడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.







