సోషల్‌ మీడియా వేదికల్లో హోంటూర్లు, రోజువారీ జీవితం, విలాసవస్తువులను ప్రదర్శించే ధోరణి పెరుగుతోంది. ఇలాగే తన ఇంటి లోపలి భాగాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలాసవస్తువులను వీడియోల ద్వారా చూపించిన ఓ యూట్యూబర్‌ దొంగల బారిన పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.

పోలీసులు, బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా మోహనీ గ్రామానికి చెందిన రచనా గుజ్జర్‌ యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికల ద్వారా తరచూ వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటారు. ఇంటి లేఅవుట్‌ స్పష్టంగా కనిపించేలా గదులు, అల్మారాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలాసవస్తువులను చూపిస్తూ పలు హోంటూర్‌ వీడియోలను ఆమె పోస్ట్‌ చేసినట్లు తెలిసింది.

ఇటీవల ఆమె ఇంట్లో చోరీ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కాకుండా, కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నప్పుడే దొంగలు ఇంట్లోకి చొరబడ్డారని రచనా గుజ్జర్‌ పోలీసులకు తెలిపారు. తాము నిద్రిస్తున్న గదికి దొంగలు బయట నుంచి తాళం వేసి, మరో గదిలో ఉంచిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు ఆమె వాపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు.

దొంగలు ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల దిశలను మార్చి, తమ కదలికలు రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారని రచనా గుజ్జర్‌ తెలిపినట్టు సమాచారం. ఉదయం నిద్రలేచిన తర్వాత గది తలుపు బయట నుంచి తాళం వేసి ఉందని గుర్తించడంతో అనుమానం వచ్చిందని, వెంటనే పరిచయస్తులకు ఫోన్‌ చేయగా వారు వచ్చి తాళం తీసి బయటకు తీశారని ఆమె వివరించినట్లు పోలీసులు చెప్పారు. చోరీ జరిగిన తర్వాత ఇంట్లోని పరిస్థితులు, దొంగలు ఎలా చొరబడ్డారన్న అంశాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలను కూడా రచనా గుజ్జర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేయడం గమనార్హం. ఆమె హోంటూర్‌ వీడియోల్లో బంగారం, విలాసవస్తువుల వివరాలు స్పష్టంగా కనిపించడం వల్లే ఈ చోరీకి దొంగలు ప్లాన్‌ చేసి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ సంఘటనపై శివపురి అదనపు ఎస్పీ సంజీవ్‌ ములె దర్యాప్తు కొనసాగుతున్నట్లు ధ్రువీకరించారు. నిందితులు అదే ప్రాంతానికి చెందినవారై ఉండొచ్చని, లేక ఆ కుటుంబం గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి ముందే తెలిసినవారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హోంటూర్‌ వీడియోలు, ఇతర సోషల్‌ మీడియా పోస్టులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత జీవితం, ఇంటి నిర్మాణం, విలువైన వస్తువుల వివరాలను అతిగా ప్రదర్శించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రచనా గుజ్జర్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు.